శ్రీసిటీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

శ్రీసిటీ(వరదయ్యపాళెం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను పురస్కరించుకుని శ్రీసిటీలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా సోలమ్‌ ఇండియా హైటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) సభ్యులు ఎన్‌. నాగేశ్వరరాజు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రాంతీయ డైరెక్టర్‌ హెచ్‌.డి. వరలక్ష్మి పాల్గొన్నారు. శ్రీ సిటీ హార్టికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్‌ విభాగం ఇన్‌చార్జి డి.ఎన్‌. రెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అతిథులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి దిశగా కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సత్యవేడు అటవీ శాఖ రేంజ్‌ అధికారి త్రినాథరెడ్డి గౌరవ అతిథిగా హాజరై, మొక్క నాటారు. ఈ సందర్భంగా నాగేశ్వరరాజు మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కొని, భూమి భవిష్యత్తును కాపాడడం మనందరి ఉమ్మడి బాధ్యత అని ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తుచేస్తోందని చెప్పారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రస్తుతం అతిపెద్ద సవాలు అని, దీనిని ఎదుర్కొనేందుకు శ్రీసిటీ కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. శ్రీసిటీ హార్టికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ విభాగం ఇన్‌చార్జి డీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీలో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా మొక్కలు నాటామని, ఈ ఏడాదిలో మరో పది వేలకుపైగా మొక్కలు నాటే ప్రణాళిక ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement