భద్రతా ప్రమాణాలు పాటించకుంటే సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

భద్రతా ప్రమాణాలు పాటించకుంటే సీజ్‌

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

తిరుపతి మంగళం : విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల, కళాశాలల బస్సులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాహనాలను సీజ్‌ చేస్తామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ హెచ్చరించారు. తిరుపతి జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై శుక్రవారం రవాణా శాఖాధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించిన మోటారు వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో సుమారు 850 విద్యాసంస్థల బస్సులను పరిశీలించి, సాంకేతిక లోపాలున్న 75 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, మరమ్మతులు చేసి, వాహనాలను తిరిగి తనిఖీకి తీసుకురావాలని సంబంధిత యాజమాన్యాలను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని బస్సులు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందిన తర్వాతే రోడ్లపై వాహనాలను నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్‌ సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మోటారు వాహన చట్టాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. అనంతరం జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌తో పాటు మోటారు వాహన తనిఖీ అధికారులు బస్సుల నిర్వహణ, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, పన్నుల చెల్లుబాటు, అత్యవసర మార్గ ద్వారాల ఏర్పాటు, వేగ నియంత్రణ పరికరాల అమరిక, వాటి పనితీరు, అగ్నిమాపక పరికరాల లభ్యత, చెల్లుబాటు కాలం, డ్రైవర్ల లైసెన్స్‌లతో పాటు వారి అనుభవం ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల బస్సులు, యాజమాన్య నిర్లక్ష్యంపై ప్రశ్నించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement