ఘనంగా విత్తన దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా విత్తన దినోత్సవం

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

చంద్రగిరి: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం విత్తన దినోత్సవం అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.చంద్రిక అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు విత్తన నాణ్యతపై అవగాహన కల్పించాలనే వీసీ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తుకుంటేనే ఆశించిన మేర అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయ డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ మునిరత్నం మాట్లాడుతూ రైతులు తమ సొంత అనుభవాలకు శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలను జోడించి, రైతు స్థాయిలోనే స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవడం ద్వారా ఆర్థికంగా అధిక లాభాలు గడించవచ్చన్నారు. మొక్కల ప్రజనన విభాగపు అధిపతి డాక్టర్‌ వసుంధర మాట్లాడుతూ పంట పండించడానికి నేల, నీరు ఎంత బాగున్నప్పటికీ సరైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవడమే అత్యంత కీలకమైన అంశమన్నారు. అధిక దిగుబడులు సాధించాలంటే నేల స్వభావం, నీటి లభ్యత, నాణ్యమైన విత్తనం, రుతుపవనాల గమనంపై అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఎమ్‌ రెడ్డి శేఖర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వేరుశనగ ప్రజనన విభాగ శాస్త్రవేత్తలు రూపొందించిన ‘వేరుశనగ పంటలో విత్తనోత్పత్తి పద్ధతులు‘ అనే పుస్తకాన్ని అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. విశ్వ విద్యాలయం రూపొందించిన పంట రకాలు, బయో పెస్టిసైడ్స్‌ , జీవన ఎరువులు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement