రేణిగుంట: ఙమొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రేణిగుంట మండలంలోని తూకివాకం సమీపంలో తుడా ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, తుడా చైర్మన్ సి.దివాకర్ రెడ్డి పాల్గొని, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతోపాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే మొక్కలు బతకవన్నారు. మొక్కల సంరక్షణలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని, సాధారణంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.4 డిగ్రీలుగా ఉండగా, ప్రస్తుతం 15 డిగ్రీలు దాటితే తీరప్రాంతాల్లో నివసించే మూడో వంతు జనాభా తీవ్ర ప్రభావానికి గురవుతున్నారన్నారు. తిరుపతి, శేషాచలం కొండల్లో ఉన్న చెట్ల కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో తుడా అధికారులు, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ఎంపీడీవో రవిచంద్ర, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


