ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలి

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: అరణియార్‌ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న అధికార పార్టీ ముఠాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌బీ పేట విలేజ్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.చంద్రన్‌ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం ఆయన ఆ అసోసియేషన్‌ సభ్యులతో కలసి తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. పిచ్చాటూరు మండలం నుంచి నాగలాపురం మండలం సురుటపల్లికి ఇరువైపుల దాదాపు 23 గ్రామాల వారు ఆరణియార్‌ నది నీటితో పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. నదిలో నుంచి సుమారు 150 టిప్పర్లు, 120 ట్రాక్టర్లు, 50 ఇటాచీలతో ఇసుక, గ్రావెల్‌, రోడ్డు కంకరను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేత సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శంకర్‌రెడ్డి తన అనుచరులతో యథేచ్ఛగా అక్రమ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విలేజ్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సహజ వనరులను ధ్వంసం చేస్తున్న విషయమై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సదరన్‌ జోన్‌, చైన్నెలో ఫిర్యాదు చేశామన్నారు. ఆ మేరకు న్యాయస్థానం ఇసుక, గ్రావెల్‌, కంకర తరలింపును నిలిపివేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇందుకు సంబందించిన కాపీలను జిల్లా మైనింగ్‌శాఖతోపాటు ఆయా ప్రభుత్వశాఖాధికారులకు అందించినా స్పందన లేదన్నారు. ఇసుక, గ్రావెల్‌, రోడ్డు మెటల్‌ రవాణాను అడ్డుకుని న్యాయం చేయాలని విజ్ణప్తి చేశారు. అసోసియేషన్‌ సభ్యులు బాబునాయుడు, సుబ్రమణ్యం, జి.బాలాజీ, డి.మనోహర్‌, ఎస్‌.విల్సన్‌, కె. మధుబాబు, కె.రవీంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement