జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగం ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగం ఎప్పుడో?

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

● టార్గెట్‌ మార్చి 21వ తేదీ ● వరుస వైఫల్యాలతో ప్రయోగాలకు బ్రేక్‌

సూళ్లూరుపేట:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకెళుతున్న సమయంలో వరుసగా రెండు పీఎస్‌ఎల్‌వీ వైఫల్యాలతో ప్రయోగాలకు చాలాకాలం బ్రేక్‌ పడింది. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమై ఉంటే మార్చి నెల 21 నాటికే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగం జరిగి ఉండే ది. ప్రస్తుతం ఈ ప్రయోగం కూడా ఎప్పుడు నిర్వహి స్తారో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొంది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 రాకెట్‌ అనుసంధానం పనులు మొదటి వెహికల్‌ అసెంబ్లింగ్‌ భవనంలో నిర్వహిస్తున్నారు. మూడో దశ అంటే క్రయోజనిక్‌ దశకు పైభాగంలో శాటిలైట్‌ అమర్చే రింగ్‌ విషయంలో సాంకేతిక లోపం తలెత్తి ఈ ప్రయోగం కూడా మరి కొంతకాలం బ్రేక్‌ పడింది. ఈ రింగ్‌ పంపేటప్పుడు మారిపోయిందని, శాటిలైట్‌ మోసే అంత స్టంట్‌ లేని రింగ్‌ను పంపారని, దీనికి బదులుగా బాగా స్టంట్‌ ఉన్న రింగ్‌ అవసరం ఉందని అది వచ్చిన తరువాతే శాటిలైట్‌ అమర్చే ప్రక్రియను చేపడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోల బరువు కలిగిన ఈఓఎస్‌–5 ఉపగ్రహా న్ని పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అయితే గత ఏడాది మే 18న పీఎస్‌ఎల్‌వీ సీ61, ఈ ఏడాది జనవరి 13న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ62 రెండు ప్రయోగాలు మూడో దశలో ఒకే సాంకేతికపరమైన కారణాలతో వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది. మే నెలలో అయినా ప్రయోగాలు ఉంటాయా; అన్న విషయం అనుమానంగానే ఉంది. జీఎస్‌ఎల్‌వీ ఎప్‌17 ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్సాహంగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో కూడా ప్రయోగాల సందడి కనిపించకుండా పరిస్థితి స్తబ్దుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement