– డీఈఓకు ఏపీసీగా అదనపు బాధ్యతలు
తిరుపతి అర్బన్: విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్రశిక్షా ఏపీసీ గౌరీశంకర్‌రావును సరెండర్ చేశారు. సాక్షి దినపత్రికలో ఆదివారం ‘సమగ్రశిక్షలో లైంగిక వేధింపులు’ అనే శీర్షికతో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమగ్రశిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ)గౌరీశంకర్‌రావుపై అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ అనంతరం డీఈఓ కేవీఎన్ కుమార్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు వివరాలను నివేదించారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ అలాంటి ఉద్యోగులు మనకు అవసరం లేదంటూ ఆయన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సమగ్రశిక్ష ఏపీసీగా డీఈఓకు అదనపు బాధ్యతగా అప్పగించారు. అయితే ఈ అంశంపై పూర్తి నివేదిక కోసం ఏపీసీ గౌరీశంకర్‌రావును త్వరలోనే సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. నిజనిర్థారణ అనంతరం శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
బడిఈడు పిల్లలను
పాఠశాలలో చేర్చండి
తిరుపతి అర్బన్: బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ డీఈఓని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా ‘మన సంకల్పం–విద్యా ప్రగతి’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని ఆదేశించారు. బడిఈడు పిల్లలు ఇతర పనులు చేస్తుంటే వారి తల్లిదండ్రులకు చదువుతోనే అభివృద్ధి సాధ్యమనే అంశంపై అవగాహన కల్పించి, వారి పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్న విషయాలను విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు వివరించాలని వెల్లడించారు. ఏప్రిల్ 23 తర్వాత జూన్ 11 వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేసి, విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీలాదేవి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి, సీపీఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
హమ్మయ్యా..
పుస్తకాలు వచ్చాయోచ్!
తిరుపతి సిటీ: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పుస్తకాలు వచ్చాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమై 15 రోజులు గడిచాయి. తరగతలు ప్రారంభమైన రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ పేరుతో విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం సమయానికి పుస్తకాలు అందించడంలో విఫలమైంది. దీంతో విద్యార్థులు గత 15 రోజులుగా ఉత్తి చేతులతో తరగతులకు హాజరై కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి నూతన సిలబస్‌తో కూడిన పుస్తకాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సహకారంతో జిల్లాలోని ఆర్‌ఐఓ కార్యాలయానికి చేరవేశారు. కార్యాలయ సిబ్బంది జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలకు చేరవేసే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు నూతన పుస్తకాలను అందించనున్నట్లు తెలుస్తోంది.
అభ్యంతరాలు తెలియజేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లకు గ్రేడ్ 2 హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పించనున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగోన్నతుల ప్రక్రి య పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ మేనేజ్‌మెంట్ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్‌ల సాధారణ ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ సీనియారిటీ జాబితాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలకు పంపినట్లు చెప్పారు. ఉద్యోగోన్నతులకు అర్హులైన టీచర్లు జాబితాలను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16వ తేదీలోపు తగు ఆధారాలతో చిత్తూరు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువు తేదీ ముగిసిన తర్వాత అందే అభ్యంతరాలను స్వీకరించేది లేదని డీఈవో వెల్లడించారు.


