అక్రమార్కులను పట్టించినందుకు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులను పట్టించినందుకు అరెస్టు

Mar 17 2026 7:23 AM | Updated on Mar 17 2026 7:23 AM

● స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా ● భారీ యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వకాలు ● ఇసుకాసురులను పట్టించి పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు ● దొంగలను పట్టించిన నేతలు, రైతులపై కేసులు !

పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతల దౌర్జన్యాలను ప్రశ్నించిన రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారు. పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో కాంట్రాక్టర్‌, కూటమి నాయకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా భారీ హిటాచీలతో నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు, సాగునీరు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపై సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి స్థానిక రైతులతో కలిసి ఇసుక దోపిడీని అడ్డుకుని, పలు యంత్రాలు, లారీలను పోలీసులకు అప్పగించారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకపోగా, ఇసుక దోపిడీని అడ్డుకున్న రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని తిరుపతి విమానాశ్రయం వద్ద, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, రైతులు అట్ల గోపాలయ్య, శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సురేష్‌రెడ్డిను వారివారి నివాసాల వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి, దొరవారిసత్రం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయుడుపేటలో వైద్య పరీక్షలు అనంతరం నాయుడుపేట కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి నెల్లూరు జైలుకు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే కిలివేటి అరెస్టుకు రెక్కీ

సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఎలాగైనా అరెస్టు చేయాలని డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో రెక్కీ నిర్వహించారు. పెళ్లకూరు మండలం కలవకూరులో స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవడంతో పాటు సోమవారం నాయుడుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం చేస్తున్న అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ పోలీస్‌ బలాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే సంజీవయ్యను అరెస్టు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంజీవయ్య నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా మొహరించడంతో పోలీసులు ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. అందుకే 144 సెక్షన్‌ విధించారు. సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement