తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,057 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,990 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
కలెక్టరేట్‌లో
అమరజీవి జయంతి
తిరుపతి అర్బన్: అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను కలెక్టర్ వెంకటేశ్వర్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో అమరజీవి జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు. ఆ తరువాతే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నేటితో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా గత నెల 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. మంగళవారం సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్–1 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 84 పరీక్ష కేంద్రాలలో సుమారు 24 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంస్థ అధికారులు, సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 54 వినతులు వచ్చాయన్నారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని 9 జిల్లాల వినియోగదారులు విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, ఎం.కృష్ణారెడ్డి, సీహెచ్ రామచంద్రరావు, జనరల్ మేనేజర్లు చక్రపాణి, భాస్కర్ రెడ్డి, జగదీష్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


