రక్తపు మడుగులో యువకుడు | - | Sakshi
Sakshi News home page

రక్తపు మడుగులో యువకుడు

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

రక్తప

రక్తపు మడుగులో యువకుడు

● సకాలంలో స్పందించని 108 సిబ్బంది ● ఆటోలో యువకుడిని వైద్యశాలకు తరలించిన పోలీసులు ● పోలీసుల చొరవపై స్థానికుల హర్షం

రేణిగుంట: మండల కేంద్రమైన రేణిగుంటలో బుధవారం ఒక యువకుడు కత్తి చేతపట్టి రోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. తన మెడపై కత్తితో నరుక్కున్నాడు. అంతటితో ఆగక రాయితో తల పగులగొట్టుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతన్ని అడ్డుకుని పోలీసులు, 108 వాహనానికి సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శరీరమంతా రక్తసిక్తంగా ఉన్న అతని రెండు చేతులను కట్టి పెట్టారు. 108కి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. వైద్య సిబ్బంది ప్రాథమిక వైద్యం చేసినా రక్త స్రావం ఆగకపోవడంతో తిరుపతి రుయాకు తరలించారు.

200 మీటర్ల దూరంలో ఉన్నా 108 నుంచి స్పందన కరువు

సంఘటన అంబేడ్కర్‌ విగ్రహం కూడలి వద్ద జరిగింది. 108 వాహనం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉంది. 200 మీటర్ల దూరం కూడా లేదు. 108 వాహనం సకాలంలో రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడి శరీరం నుంచి రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో పోలీసులతో కలిసి స్థానికులు అతని మెడకు గుడ్డ కట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల సేవలపై స్థానికుల హర్షం

సంఘటన జరిగిన వెంటనే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ జయచంద్ర వెంటనే స్పందించారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు శీను, రత్న ప్రసాద్‌, కనకరాజును పంపించారు. వారు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తూనే యువకుడిని రక్షించేందుకు ప్రయత్నించడం ఆస్పత్రికి తరలించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

డ్రగ్‌ మత్తా.. లేక మానసిక పరిస్థితి బాగా లేక...

అస్సాం రాష్ట్రానాకి చెందిన నలుగురు యువకులు ఉద్యోగరీత్యా కోయంబత్తూర్‌ వెళుతున్నారు. వారిలో కరోల్‌ అనే యువకుడు రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగాడు. అతను అంబేడ్కర్‌ విగ్రహం కూడలి వద్దకు చేరుకుని కత్తితో నరుక్కున్నాడు. అతనికి మానసిక పరిస్థితి బాగా లేదా.. లేక డ్రగ్స్‌ మత్తులో అలా చేశాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

దిష్టిబొమ్మలా 108 వాహనం

ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు సమయానికి రాని 108 వాహనం ఎందుకు. యువకుడు ఉదయం 8.30 గంటలకు మెడ నరుక్కుంటే 11 గంటలైనా 108 వాహనం రాలేదు. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ కార్యాలయం నుంచి రావడానికి 2 గంటలు పడుతుందా? దీనిపై ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి చర్యలు తీసుకోవాలి. – కొండ్రెడ్డి హరినాథ్‌,

సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్‌, రేణిగుంట

రక్తపు మడుగులో యువకుడు1
1/1

రక్తపు మడుగులో యువకుడు

Advertisement
 
Advertisement
Advertisement