అందరికీ వాటాలిస్తున్నాం..
● మట్టిమాఫియాకు అడ్డాగా ఇందిరమ్మ కాలనీ ● జేసీబీలు ట్రాక్టర్లతో విచ్చలవిడిగా గ్రావెల్ తరలింపు ● అడ్డుకున్న స్థానికులతో మాఫియా ముఠా వాగ్వాదం ● రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేత ప్రజాప్రతినిధిగా ఎన్నికై న నాటి నుంచి ప్రకృతి వనరులను ఆ పార్టీ నేతలు కొల్లగొడుతూనే ఉన్నారు. తాము చెప్పినట్లు తలలు ఊపే అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించుకుని, అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ప్రజాప్రతినిధి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన అధికారులు సైతం వారి బాటలోనే పయనమవుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు.
మట్టి మాఫియాకు అడ్డా
స్థానిక చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ మట్టి మాఫియాకు అడ్డాగా నిలిచింది. కాలనీలోని చివరి ప్రాంతంలో ఉన్న కొండగుట్టను ధ్వంసం చేస్తూ విలువైన ఎర్రమట్టిని దోచుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా గుట్టు చేస్తున్న ఈ దందాపై స్థానిక ప్రజలు తిరగబడటంతో బయటకు పొక్కింది. అయితే మట్టి మాఫియా ముఠా మాత్రం తాము అధికార పార్టీ నేతలకు, అధికారులకు వాటాలు ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు వందకు పైగా ట్రిప్పులు వెళ్తున్నాయంటే మాఫియా అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
రెవెన్యూలోని కీలక అధికారికి ముడుపులు
మట్టి, ఇసుక అక్రమ రవాణాపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా రెవెన్యూ అధికారులు మాత్రం ఏడాదిన్నరగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదు చేసిన వెంటనే అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టంగా వివరణ ఇస్తాడు. అయితే అక్రమాలపై ఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేదు.
రేపటి నుంచి ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
తిరుపతి సిటీ: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ వర్సి టీ అధ్యయన కేంద్రం రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్ట ర్ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందించామని తెలిపారు. నిర్ణీత గడవుకు 30 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. డిగ్రీ థర్డ్ ఇయర్ 5వ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు, సెకండియర్ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు, ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ, యూజీ, పలు డిప్లొమా కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోపు ఇగ్నో వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
రాపూరు: కృష్ణపట్నం–ఓబులవారి పల్లి రైల్వే మార్గంలోని రాపూరు–వెలికల్లు రైల్వే స్టేషన్ మధ్యలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్‌రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు నెల్లూరు రైల్వే ఎస్‌ఐ హరిచందన తెలిపారు. అతని వయస్సు సుమారు 60–65 మధ్యలో ఉంటుందని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆమె చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతనికి సంబంఽధించిన వారు ఎవరైనా ఉంటే నెల్లూరు రైల్వేస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


