తిరుపతిపై ‘పచ్చ’పాతం
తిరుపతి తుడా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజన తర్వాత దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తిరుపతికి చేసింది ఏమీ లేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, జీవనం సాగించారు చంద్రబాబు. రాష్ట్రంలో అత్యున్నత పదవైన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినా తనకు ఇంటి హోదాను, గుర్తింపునిచ్చిన తిరుపతి రుణం కాసింతైనా తీర్చుకోలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. పుట్టిన ఊరు నారావారిపల్లిని సైతం పట్టించుకోలేదన్న అపకీర్తి గడించారని జిల్లా ప్రజలు నిత్యం వాపోతుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా, మూడో బడ్జెట్‌లోనూ తిరుపతికి తీరని అన్యాయం చేశారు. నగర అభివృద్ధికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర చిత్తు కాగితాల్లానే మిగిలిపోయాయి. ఈసారి బడ్జెట్‌లో నైనా వాటిని జులిపించి ఎంతోకొంత నిధులు కేటా ఇస్తారని అందరూ భావించారు. అందరు ఆశలను ఆడి ఆశలు చేశారు.
స్మార్ట్ సిటీకి చెక్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీలో తిరుపతి 2017లో ఎంపిక కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలలు ముందు పట్టాలెక్కింది. రూ.1610 కోట్ల ప్రణాళికలతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభం కాగా ఇందులో కేంద్రం రూ. 500 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 500 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా రూ.316 కోట్లు చొప్పున పలు విడతల్లో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.184 కోట్లు విడుదల చేస్తే కేంద్రం కూడా మిగిలిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల స్మార్ట్ సిటీ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా స్మార్ట్ నిధులను విడుదల చేయాల్సి ఉంది. రూ.90 కోట్ల వ్యయంతో సిటీ ఆపరేషన్ బిల్డింగ్ సెంటర్(కార్పొరేషన్ కొత్త భవనం) పనులను 2022లో ప్రారంభించారు. ఎన్నికలు పూర్తి చేసుకునే నాటికి పనుల్లో 50 శాతం పూర్తయ్యాయి. 2023లో రూ.18 కోట్లు విడుదల చేయగా ఏడాది క్రితం వరకు ఆ నిధులతో పనులు చేశారు. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు చిల్లి గవ్వ విధిలించలేదు. అలాగే సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, తదితర అనేక ప్రాజెక్టులు నిధులు లేక అర్థాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో స్మార్ట్ సిటీకి నిధులు కేటాయిస్తే మొండి గోడలు కాస్తయినా ముందడుగు వేస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది.
ఇక అభివృద్ధి లేనట్టే..
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తిరుపతికి సవాల్ విసురుతోంది. ప్రతిరోజు అనేక ప్రాంతాల్లో యూడీఎస్ ఓవర్ ఫ్లో సమస్యాత్మకంగా మారింది. నగరం విస్తరించినా యూడీఎస్ ఓల్డ్ సిటీకే పరిమితమై ఉంది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన లైన్‌పై అధిక భారం పడుతోంది. కొత్త యూడీఎస్ వేయాలంటే రూ.450 కోట్లు అవసరమని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాబు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లో పక్షపాతం చూపడంతో తిరుపతి అభివృద్ధి అధోగతేనని ప్రజలు వాపోతున్నారు.


