దళిత ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం : దళిత ద్రోహి సీఎం చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు తలారి రాజేంద్ర, ఎస్సీ సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నల్లాని బాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు సాల్మన్‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని అంబేడ్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ దళితులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. సాల్మన్‌ది రాజకీయ హత్యని ఆరోపించారు. దళిత మహిళ అనిత హోమ్‌మంత్రిగా ఉన్నా దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరగడం, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ప్రజాసంక్షేమాన్ని పట్టించుకుంటున్నావా? పవన్‌కళ్యాన్ అని ప్రశ్నించారు. సాల్మన్ కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారంతో పాటు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు వాసుయాదవ్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, లవ్లీ వెంకటేష్, పసుపులేటి సురేష్, మేర్లపాక మురళి, రమణారెడ్డి, కోటి, అరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


