నేడు ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం సీమ సమావేశం
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ జిల్లాల ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈనెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, శ్యాంసుందర్ తెలిపారు. సమావేశంలో పీఎస్ హెచ్‌ఎంల తాజా సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకు పోవడంపై చర్చిస్తామన్నారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రతి పీఎస్ హెచ్‌ఎం తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమస్ఫూర్తితో ముందుకు రావాలని కోరారు.
రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం
తిరుపతి సిటీ: సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు సంక్రాంతి సెలవుల్లో సరదాగా గడిపిన విద్యార్థులు తమ స్వస్థలాల నుంచి బడిబాట పట్టనున్నారు.
జాతీయ ప్రతిభా పురస్కారానికి జగన్నాథం ఎంపిక
వరదయ్యపాళెం: మండలానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి, జానపద కళాకారుడు పోల్లూరు జగన్నాథం జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవంలో పోల్లూరు జగన్నాథం జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోవాలని ఆయనకు ఆహ్వానం అందింది. తెలుగు అక్షర సేవలు, సాహిత్య, సాంస్కృతిక తపన, సజనాత్మక ప్రతిభను గుర్తించి ఆయన్ని ఎంపిక చేసినట్లు శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీభూషణం ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు.


