మీ తెలివితో లోకేష్‌కు దిమ్మతిరగాలి పవన్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘మీ తెలివితో లోకేష్‌కు దిమ్మ తిరగాలి పవన్ కళ్యాణ్ గారూ’’ అంటూ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైటెర్లు విసిరారు. తిరుపతి జిల్లా పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత స్థిర నివాసం కల్పించేలా అటవీశాఖ ఆధ్వర్యంలో అనువైన పరిస్థితుల్ని కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలపై భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. అందుకు సంబంధించి భూమన కరుణాకరరెడ్డి మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్‌ని భూమన ఏమన్నారంటే.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయి. అంత గొప్ప నామధేయులు మీరు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నట్లు మీడియాలో చూశాను. ఎక్కడో సైబీరియా నుంచి వందల, వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చే ఫ్లెమింగో పక్షులు తిరిగి ఆ దేశానికి వెళ్లకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వతంగా ఉంచేంతగా చేస్తున్న నీ ఆలోచనల్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ సందర్భంగా మీకో విన్నపం. బంగాళాఖాతం నుంచి వందల, వేల మైళ్ల దూరం ప్రయాణం చేసి, గోదావరి నదికి వచ్చే పులస చేపను కూడా స్థిర నివాసం ఏర్పరచుకునేలా చేయాల్సిందిగా కోరుతున్నాను. తద్వారా పిఠాపురం నియోజక వర్గ ప్రజలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అందరికీ పులస చేప దొరికేలా చేయాలి. ఏప్రిల్, మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఆ సమయంలో శీతల వాయువుల్ని పూర్తిగా మీ ఆధీనంలో ఉంచుకుని చల్లటి వాతావరణాన్ని కల్పించాలి. వేల మైళ్ల దూరం నుంచి, వేల సంవత్సరాలుగా వస్తున్న ఫ్లెమింగో పక్షులను ఇక్కడే పెట్టేయాలన్న మీ ఆలోచన దార్శనికతను మెచ్చుకుంటూ.. ఇలాంటి పనులు కూడా చేయాలని కోరుతున్నా.
సనాతన ధర్మ పరిరక్షకా.. మీరింకా చాలా చేయాలి
సనాతన ధర్మ పరిక్షక మీరింకా చాలా చేయాలి. ప్రమాదాలు జరగకుండా రోడ్లను, తొక్కిసలాట జరక్కుండా దేవాలయాలను, 24 గంటలు తాగినా తూలి రోడ్ల మీద పడపోకుండా మద్యం ప్రియుల్ని వీళ్లందరినీ కంట్రోల్ చేయాలి. ఫ్లెమింగో పక్షులకే ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచాలని అనుకున్నప్పుడు మీకు చేతకానిదంటూ ఏదీ ఉండదు. చంద్రబాబుతో చర్చించి మీరిలాంటి చందన సేవలు కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కొత్తగా అధికారం అందుకున్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి.. మీరు ఆ ఆనందపు మత్తులో మాట్లాడుతున్న మాటలకు గాలిలోని పక్షుల్ని, నీటిలోని చేపల్ని, అడవిలోని ఏనుగుల్ని.. ఇలా అన్నింటిపై అధికారం చూపాలని, ఆధీనంలోకి తెచ్చుకోవాలనే మీ అభిలాషను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. మేమెందుకు కాదనాలి. ఇంతటి మంచి పనులు మీనుంచి ఆశించడం తప్పుకూడా కాదు. సినిమాలో మీరొక్కరే వంద మందిని చెడామడా కొట్టినట్టుగా.. ప్రకృతిని శాసించే శక్తి, అధికారం ఉప ముఖ్యమంత్రి అయినటు వంటి పవనానందుల స్వాముల వారికి సిద్ధించాలని ఆ దేవదేవున్ని ప్రార్థిస్తున్నా. మీ జ్ఞాన తృష్ణను, మీకున్న అమోఘమైన ప్రజ్ఞను చూసి లోకేష్‌కే దిమ్మ తిరగాలి. అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైటర్లు విసిరారు.


