గడువు లోపు భూసేకరణ పూర్తి చేయాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్– చైన్నె కారిడార్ పనులు, ఏపీఐఐసీ సంబంధించిన దుగ్గరాజపట్నం పనుల కోసం నిర్ణీత గడువు లోపు భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో భూసేకరణ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, చైన్నె నేషనల్ హైవే పీడీలు, తిరుపతి, సూళ్లూరుపేట ఆర్డీఓలు, రామ్మోహన్, కిరణ్మయి, రోడ్డు భవనాల శాఖ ఎస్‌ఈ రాజా నాయక్, రైల్వే ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ తదితరులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు విజయ్‌భరత్‌రెడ్డి, ఎల్. శివకుమార్, తిరుపతి తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
తేనెటీగల దాడిలో
22 మందికి గాయాలు
వాకాడు: వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్–కోట గ్రామాల మధ్య రంగన్న గుంట వద్ద మంగళవారం తేనెటీగలు దాడిచేయడంతో 22 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోటకు వెళ్లే రహదారిలో రంగన్న గుంట ఎస్‌టీ కాలనీ వద్ద సాయంత్రం వేళ రాకసి తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గాని వచ్చి పోయే ద్విచక్ర వాహనదారులపై మూకుమ్మడిగా దాడిచేశాయి. ఈ దాడిలో వాహనచోదకులు, పాదచారులు దాదాపు 22మంది గాయపడ్డారు. గాయపడిన వారు శరీరంపై వాపు, తీవ్ర నొప్పులతో అల్లాడిపోతూ చికిత్స నిమిత్తం వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి 9 మంది, కోటకు 8 మంది, గూడూరుకు 5 మంది వెళ్లినట్లు తెలిసింది.
గడువు లోపు భూసేకరణ పూర్తి చేయాలి


