ఏర్పేడు దుర్ఘటనకు 8ఏళ్లు
రేణిగుంట: సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట ఇసుక అక్రమ రవాణాపై గళమెత్తిన గొంతులు శాశ్వతంగా మూగబోయిన దుర్ఘటన నేటికీ ఆ గ్రామస్తులకు పీడకలే.. ఏర్పేడు మండలం మునగలపాళెం గ్రామ శివారున ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసుకను జేసీబీలు పెట్టి అక్రమ రవాణా చేస్తున్నారని, దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు దెబ్బతింటున్నాయని స్థానికులు, చిన్న, సన్నకారు రైతులు ధర్నా చేసేందుకు 2017, ఏప్రిల్ 21న మండల కేంద్రానికి వచ్చారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది బలయ్యారు. ఈ ఘటనకు అప్పట్లో టీడీపీ మండల నాయకులు పేరం ధనంజయులునాయుడు, పేరం నాగరాజునాయుడు, చిరంజీవులునాయుడు మరి కొంత మందిపై నామమాత్రపు కేసులు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే కొంతకాలానికి వారు మళ్లీ పార్టీలో చేరి మండలాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏలుతున్నారు.
నేడు స్మారక స్థూపం వద్ద నివాళులు
ఇసుక ప్రమాద ఘటనలో అశువులు భాసిన రైతుల స్మారక చిహ్నాన్ని మునగలపాళెం గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ సోమవారం బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజాసంఘాలు నివాళులర్పించనున్నారు.


