భర్త విడాకులు నోటీసు ఇచ్చారని.. | Sakshi
Sakshi News home page

భర్త విడాకులు నోటీసు ఇచ్చారని..

Published Wed, Sep 6 2023 1:02 AM

- - Sakshi

తిరుపతి క్రైం: భర్త విడాకులు నోటీస్‌ ఇచ్చారని ఓ మహిళ మనస్తాపానికి గురై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. శ్రీనివాసమంగాపురం గ్రామానికి చెందిన భారతి(45)కు నాగలాపురం గ్రామానికి చెందిన తులసీరామ్‌తో 26 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నికిత(15) కుమార్తె ఉంది.

తులసీరామ్‌ టీటీడీలో అసిస్టెంట్‌ షరాఫ్‌గా పని చేస్తున్నారు. తులసీరామ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గత ఐదేళ్లుగా వీరిద్దరూ దూరంగా ఉండేవారు. భారతి కూతురు నికితతో కలిసి అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వినాయకనగర్‌ సీ టైప్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. అయితే ఇటీవల తులసీరామ్‌ విడాకులు కావాలంటూ భారతికి నోటీసులు పంపించడంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైంది.

భర్త మేనమామ గోవిందరాజులు విడాకులు ఇవ్వాలని బలవంతం చేయడంతో ఏం చేయాలో తెలియకుండా గత నెల 31వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గుర్తించి, ఆమెను రుయాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భర్త తులసీరామ్‌తోపాటు వారి మేనమామను కూడా అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

 

Advertisement
Advertisement