ఉద్యోగుల ఉద్యమ బాట
రెండు రోజులుగా 58 సొసైటీలకు తాళాలు రోజుకు రూ.6 కోట్ల లావాదేవీలకు బ్రేక్ లక్ష మంది వినియోగదారులకు ఇబ్బందులు వీఆర్వోలు, సచివాలయ, ఉపాధ్యాయుల నిరసనలు
అధికారం కోసం హామీలు ఇవ్వడం.. తర్వాత పట్టించుకోకుండా పోవడం చంద్రబాబు నైజం. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొన్ని నెలలుగా సింగిల్ విండో, సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలు, ఉపాధ్యాయులు నిరసనలు తెలుపుతున్నారు. సింగిల్‌విండో ఉద్యోగులు ఒక అడుగు ముందుకు వేసి సమ్మెబాట పట్టారు. రెండు రోజులుగా సొసైటీలకు తాళాలు వేశారు. మిగిలిన విభాగాలకు చెందిన వారు సైతం పోరాటాలకు సిద్ధం అవుతున్నారు.
తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 58 సొసైటీల్లో 196 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు సోమవారం నుంచి విధులకు రావడం లేదు. దీంతో సింగిల్‌విండో కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఒక్కో సొసైటీలో రోజుకు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. ఇలా రోజుకు రూ.6 కోట్లకు పైగా లావాదేవీలకు బ్రేక్ పడింది. ప్రధానంగా క్రాప్ రుణాలు, బంగారు రుణాలు, రైతులకు ఎరువుల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు తదితరాలు సింగిల్‌విండో కేంద్రంగానే సాగుతున్నాయి. లక్ష మందికి పైగా రైతులు, పాడి రైతులు సేవలు పొందుతుంటారు. సిబ్బంది సమ్మెకు దిగడంతో అన్ని పనులకు బ్రేక్‌పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉద్యమ బాట
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సైతం పోరుబాట పట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తమను సర్వేల నుంచి తప్పించాలని సచివాలయ ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఒత్తిడి భరించలేక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన చెందుతున్నారు. వీఆర్వోలు కూడా తమకు అదనపు డ్యూటీలు అప్పగించరాదని వేడుకుంటున్నారు. వారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఉద్యోగులు సైతం న్యాయం కోసం కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. అలాగే కోటి పోస్టుకార్డుల ఉద్యామాన్ని చేపట్టారు. తాజా బడ్జెట్‌లో 12వ పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం, డీఏ, ఐఆర్ అంశాలను గురించి పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న సీఆర్‌పీలు కూడా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. అలాగే అన్ని విభాగాలకు చెందిన ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ డ్యూటీలు కాకుండా వాచ్‌మెన్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, సర్వేల పేరుతో దూర ప్రాంతాలకు పంపుతున్నారని వాపోయారు. పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వారికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
సమ్మెచేస్తున్న సొసైటీ ఉద్యోగులు
ఉద్యోగుల ఉద్యమ బాట
ఉద్యోగుల ఉద్యమ బాట


