మళ్లీ రాజన్న రాజ్యం రావాలి

YS Sharmila  Hold Meeting With Leaders Of Hyderabad, Ranga Reddy - Sakshi

తెలంగాణలో సంక్షేమ పాలన తేవాలి 

క్షేత్రస్థాయి సమాచారం కోసం 11 ప్రశ్నలతో ఫీడ్‌ బ్యాక్‌ పత్రం  

హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాల నేతల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ షర్మిల          

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (రాజన్న) రాజ్యం రావాలని, ఆయన సంక్షేమ పాలన తేవాలని వైఎస్‌ షర్మిల ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నానని వెల్లడించారు. శనివారం లోటస్‌ పాండ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో వైఎస్సార్‌ అభిమాన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బ్యాండ్‌ మేళాలు, లంబాడీ నృత్యాలతో కార్యాలయ ఆవరణ అంతా అభిమానులతో సందడిగా మారింది. వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం షర్మిల మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ప్రేమించారన్నారు. ప్రతీ రైతు రాజు కావాలనే తపనతో రైతు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారన్నారు. అందుకే ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక అనేక మంది తెలంగాణలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.


శనివారం లోటస్‌ పాండ్‌ ఆవరణలో వైఎస్సార్‌ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల 

డబ్బుల్లేక చదువు ఆపేయొద్దని, ప్రతీ పేద విద్యార్థి ఉచితంగా చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారని గుర్తు చేశారు. పేదవాడికి అనారోగ్యం వస్తే నేనున్నా అనే భరోసా ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారని, సొంత ఇళ్లు ఉండాలని గృహాలు నిర్మించి ఇచ్చారని వివరించారు. ఇలా ఎన్నో పథకాలు తెచ్చారు కాబట్టే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే మనస్ఫూర్తిగా వచ్చినవారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. రాజన్న తెచ్చిన పథకాలన్నీ టీఆర్‌ఎస్‌ పాలనలో అందుతున్నాయా అని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన 11 ప్రశ్నలకు ఫీడ్‌ బ్యాక్‌ అందించాలని కోరారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకోసం రూ.1,250 కోట్లు కేటాయించారని కొండా రాఘవరెడ్డి అన్నారు. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఔటర్‌రింగ్‌ రోడ్డు, గిరిజనులకు పోడు భూములు ఇచ్చారని అన్నారు. జై తెలంగాణ... జై జై తెలంగాణ.. జోహార్‌ వైఎస్సార్‌ అన్న షర్మిల నినాదాలతో సభ దద్దరిల్లింది. సమావేశంలో వెల్లాల రామ్మోహన్‌, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

11 ప్రశ్నల ఫీడ్‌ బ్యాక్‌ ఇది.. 
రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్‌ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి? వాటిని ఎలా తీర్చుకోవాలి?  
మీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతంలో వైఎస్సార్‌ చేసిన పనులు ఏమిటి?  
మనం తీసుకున్న రాజకీయ నిర్ణయం గురించి సామాన్య ప్రజలు ఏం అనుకుంటున్నారు? 
అధికారంలో ఉన్న కేసీఆర్‌/టీఆర్‌ఎస్‌ని మనం ఎలా ఎదుర్కోవాలి? మీరిచ్చే సలహాలు ఏమిటి? 
రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి? మీరిచ్చే సలహాలు ఏమిటి? 
తెలంగాణ సమాజం/ ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి? వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి? 
రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే రాష్ట్ర స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి?  
రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే జిల్లా స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? 
రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే అసెంబ్లీ, నియోజవర్గ స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? 
సంస్థాగతంగా బలపడటానికి, క్యాడర్‌ నిర్మాణానికి చేయాల్సిన పనులు ఏమిటి? 
వైఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే మీరిచ్చే సలహాలు ఏమిటి? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top