
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్‌కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్‌పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది.
తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్‌లో సమాచారం అందించింది.
వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్‌కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్‌లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.