సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Women Try To Commit Suicide At Wyra Sub Registar Office - Sakshi

సాక్షి,ఖమ్మం: వైరాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద మంగళవారం హై డ్రామా నెలకొంది. అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ భానోతు సరోజిని అనే మహిళ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన తండ్రి చావుబతుకుల్లో ఉన్నాడని చెప్పి భుక్యా బాలాజీ అనే వ్యక్తి  సరోజిని దగ్గర రెండేళ్ల క్రితం రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ బాలాజీ అప్పు చెల్లించలేదు. నెల క్రితం నిలదీయగా.. ఇంటిని అమ్మేసి అప్పు తీరుస్తానని చెప్పాడు. 

చెప్పినట్టుగానే ఇంటిని అమ్మేశాడు. కానీ, సరోజిని వద్ద తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. నేడు బాలాజీ అమ్మిన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఉండటంతో తన తల్లితో కలిసి సరోజిని  వైరాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుంది. ఆపదలో ఇచ్చిన సొమ్ము, ఇవ్వనంటే ఎలాగా.. తనకు న్యాయం జరగడం లేదని చెప్తూ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడున్నవారు ఆమెకు అడ్డుపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సరోజిని ఆవేదన వ్యక్తం చేసింది. వడ్డీ అవసరం లేదని, రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టిన అసలు ఇచ్చినా చాలునని వాపోయింది.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top