breaking news
sub register office
-
‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: నిత్యం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయం మూడు నెలలుగా దాదాపుగా వెలవెలబోతోంది. దీనికి కార ణం కేవలం ఒక్క పదమే కారణమంటే ఆశ్చర్యంగా ఉన్నా, అదే నిజం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో ‘మరియు’అనే పదం స్థానంలో ‘నుండి’ అనే పదం టైపింగ్ చేయడమే ఆ పరిస్థితికి కారణం. అప్పటి ‘నుండి’ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ఒక్క పదంతో రెండు సర్వే నంబర్లకు బదులు ఏకంగా 168 సర్వే నంబర్లలోని వందల ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీనికి హైడ్రా కూడా తోడవడంతో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు 100కుపైగా జరిగే రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గిపోయాయి. ‘మరియు’కు బదులు ‘నుండి’ కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో 58, 226 సర్వే నంబర్లలో వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో వాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టరాదని వక్ఫ్ బోర్డు ఆగస్టు 27న ఆదేశాల జారీ చేసింది. ఆదేశాలలో 58 మరియు 226 సర్వే నంబర్లు అని టైపు చేయకుండా పొరపాటున 58 సర్వే నంబర్ నుండి 226 సర్వే నంబరు వరకు అని టైపు చేయడంతో ఏకంగా 168 సర్వే నెంబర్లపై ఈ ఎఫెక్ట్ పడింది. దీంతో వందల ఎకరాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. చదవండి: మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!వాస్తవానికి నిలిపివేసిన సర్వే నంబర్లలో వక్ఫ్‌బోర్డ్ స్థలం మొత్తం కేవలం ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల నుంచి నిలిచిపోవడంతో 50 కాలనీలు, పలు బస్తీల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వెంటనే ఆదేశాల్లో దొర్లిన పొరపాటును సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ‘రిజిస్ట్రేషన్లు సగం మేర తగ్గిపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, 5 హోటల్స్, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లు బోసిపోతున్నాయి’అని రవీందర్ ముదిరాజ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: ఇక ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఇక వివాహ రిజిస్టేషన్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్లైన్లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాన్యువల్‌గా రిజిస్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్‌కి ఇచ్చేవారు. ఆయన దాన్ని సరిచూసి పుస్తకంలో నమోదు చేసుకునేవారు. ఆ తర్వాత సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్లు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే.. www.registrations.ap.gov.inలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఇ–మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం ఆన్లైన్లోనే ఫామ్‌ని పూర్తి చేసి, ఆధార్ కార్డ్‌లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సరి్టఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్‌కి ఆఫీసుకు వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజి్రస్టేషన్ల చట్టం ప్రకారం.. కచ్చితంగా రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ఉండడంతో స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లాలి. సమగ్ర ఆరి్థక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చలానా ద్వారా కట్టే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్‌కి ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి.. సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. రిజిస్ట్రేటేషన్ అయ్యాక సర్టిఫికెట్లో వాళ్ల ఫొటోలూ జతచేస్తున్నారు. ఆ తర్వాత అదే ఆన్‌లైన్‌లోనూ వస్తుంది.మొన్నటివరకు ఒకరోజు తర్వాత సర్టిఫికెట్ ఇస్తుండగా ఆన్లైన్లో వెంటనే రానుంది. ప్రత్యేక వివాహాలకు ఇలా.. హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్సైట్లో ప్రత్యేకంగా అవకాశం కలి్పంచారు. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్ ఉంటుంది. అంటే నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజి్రస్టార్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది. అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. మరింత మెరుగ్గా సేవలు.. ఈ ఆన్లైన్ విధానానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఫిజికల్ సిగ్నేచర్ కాకుండా డిజిటల్ సిగ్నేచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా కట్టే విధానాన్ని ఇంకా సులభతరం చేయనున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా కూడా చెల్లించే అవకాశం కలి్పంచనున్నారు. అలాగే ఆధార్ అథెంటికేషన్‌ను కూడా ఆన్లైన్లోనే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా వివాహ రిజి్రస్టేషన్లను ఆన్లైన్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని లాంఛనంగా పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. అప్పటివరకు వివాహ రిజి్రస్టేషన్లు ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో జరగనున్నాయి. పక్కాగా వివాహ సమాచారం ఆన్లైన్ విధానం వల్ల వివాహ సమాచారం పక్కాగా ఉంటుంది. ఏ రోజు ఎన్ని పెళ్లిళ్లు జరిగాయనే వివరాలు ఉంటాయి. ప్రస్తుతం ఏటా 3 నుంచి 4 లక్షల హిందూ వివాహాలు నమోదవుతున్నాయి. అలాగే 50 వేల లోపు ప్రత్యేక వివాహాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానంతో వీటి రిజి్రస్టేషన్లు సులభతరం కానున్నాయి. – వి.రామకృష్ణ, కమిషనర్, అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. -
ఇదేం కక్కుర్తి! రిటైర్మెంట్కు ఒక్క రోజు ముందు..
తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ముందు సెయ్యారు జిల్లా రిజిస్ట్రార్ సస్పెన్సన్‌కు గురయ్యారు. వివరాలు.. తిరువణ్ణామలైలోని సెయ్యా రు జిల్లారిజిస్ట్రార్ కార్యాలయం నియంత్రణలో సెయ్యారు, ఆరణి, వెంబాక్కం, తెల్లారు సహా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్‌గా సంపత్ పని చేస్తున్నారు. శనివారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ శుక్రవారం సస్పెన్సన్‌కు గురయ్యారు. ఆరణి సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సమయంలో భూమిని ప్రభుత్వం నిర్ణయించిన విలువ కన్నా తక్కువ విలువ కట్టి రిజిస్ట్రర్ చేయడంతో విజిలెన్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో రిటైర్డ్ అయ్యే ఒకరోజు ముందు అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. చదవండి: ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి.. -
నకిలీ చలాన్లు గుర్తింపు
-
చలానాల్లో కొత్త చిక్కులు..
ఈ చిత్రంలోని చలానాను నన్నూరుకు చెందిన రవీంద్రబాబు ఎస్బీఐ ట్రెజరీ బ్యాంకులో ఆగస్టు 24న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.11,580 కట్టి తీసుకున్నాడు. చలానా మొత్తం ఆన్లైన్లో సక్సెస్ అయినట్లు బ్యాంకు అధికారులు రసీదు ఇచ్చి పంపారు. దాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే చలానా వివరాలు డిస్ ప్లే కావడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ‘వారం రోజులవుతుంది. చలానా కాల పరిమితి సెప్టెంబర్ 5 వరకే ఇచ్చారు. ఇక రెండు రోజులే ఉంది. ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు.’ అంటు బాధితుడు వాపోతున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖలో చలానాల కుంభకోణం తరువాత తీసుకున్న చర్యలతో నెలకొన్న పరిస్థితి ఇది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో విక్రయదారులు చెల్లించిన పలు చలానాల వివరాలు డిస్ప్లే కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి వివరణ కోరాలని చెప్పి పంపుతున్నారు. అక్కడికి వెళ్తే చలానా మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ ఖాతాలకు వెళ్లిందని, పదే పదే రావద్దని గట్టిగా చెప్పి పంపుతున్నారు. ఫలితంగా ఎవరిని అడగాలో తెలియక, ఏమి చేయాలో తోచక క్రయ, విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. చలానా కాల పరిమితి దాటిపోతే మరోసారి డబ్బు చెల్లించి చలానా తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ రెండు రోజులైతే ఏమో అనుకోవచ్చు. దాదాపు 15 రోజుల క్రితం చెల్లించిన చలానాలు సైతం యాక్టివ్ కాకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమి జరిగిందంటే.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం తరువాత అధికారులు సర్వర్‌లో మార్పులు చేశారు. గతంలో ఆన్లైన్లో చెల్లించిన చలానాల నంబర్లను సీఎఫ్ఎంఎస్(కాంప్రెహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) లాగిన్‌లో అప్లోడ్ చేస్తే సంబంధిత చలానా మొత్తం డిస్ప్లే అయ్యేది కాదు. దీంతో కొందరు తక్కువ మొత్తంలో చలానాలను చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కుంభకోణం జరిగిందని ఇటీవల ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చాలా చోట్ల బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది. మరోసారి అక్రమాలకు చోటులేకుండా సీఎఫ్ఎంఎస్ సర్వర్‌లో కొన్ని మార్పులు చేసింది. క్రయ, విక్రయదారులు చెల్లించిన సీఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ ఎంటర్ చేయగానే లాగిన్‌లో ఎంత మొత్తం చలానా తీశారు? ఏ బ్యాంక్‌లో ఎప్పుడు చెల్లించారనే విషయాలు డిస్ప్లే అయ్యేలా మార్పులు చేశారు. సర్వర్ సమస్య.. ఆన్లైన్ చలానాల చెల్లింపులో నెలకొన్న కొత్త సమస్యలకు సీఎఫ్ఎంస్ లాగిన్ సర్వరే కారణమని అధికారులు అంటున్నారు. నెట్ స్లోగా ఉండడంతో ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 ఎంబీ లైన్ స్పీడు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్‌ను వేసుకోవాలని చెప్పినా పనులు నిదానంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసీలు తీసుకోవడానికి కూడా రోజుల సమయం పడుతోంది. రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది నేను కర్నూలులో సైట్ కొన్నాను. అందుకోసం రూ.11,500 చలానా తీశాను. బ్యాంకు అధికారులు దానిపై సక్సెస్ అయినట్లు సీలు వేసి ఇచ్చారు. దానిని తీసుకొచ్చి కల్లూరు సబ్ రిజిస్ట్రార్‌కు చూపితే ఆన్లైన్లో రావడంలేదని రిజిస్ట్రేషన్ నిలిపేశారు. దాదాపు 10 రోజులవుతోంది. బ్యాంకు అధికారులను అడిగితే సమస్య మావద్ద లేదంటున్నారు. డబ్బు చూపడంలేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దిక్కుతోచడంలేదు. – బాషా, నందికొట్కూరు -
విశాఖ : రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు
-
నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యుల సస్పెన్షన్
-
ఏది ఏమైనా.. ‘ఆదిలాబాద్’ దాటం అంతే!
సాక్షి, మంచిర్యాల: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి వేళ్లూనుకుపోయింది. ఏ కార్యాలయంలోనైనా మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే రోజువారీ పనులు జరుగుతాయనేది బహిరంగ సత్యం. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారి నుంచి డాక్యుమెంట్‌కు ఓ ధర నిర్ణయించి మధ్యవర్తులు చేసిన వసూళ్లు అధికారులకు ముడుతున్నాయి. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా సిటిజన్ చార్ట్ పూర్తిగా అమలు కావడం లేదు. దీంతో డిమాండ్ ఉన్న చోట పోస్టింగ్ కోసం ఉమ్మడి జిల్లాలో తమకు కావాల్సిన చోటుకి డిప్యూటేషన్ల పేరుతో బదిలీ అవుతూ తతంగం నడిపిస్తున్నారు. గతంలో ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఉన్నతాధికారులు మాత్రం వారినే తిరిగి కోరిన చోటుకు బదిలీ చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, భైంసా, నిర్మల్, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి ఉమ్మడి జిల్లా కేంద్రంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. విధి నిర్వాహాణలో అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి కేసుల్లో సబ్ రిజిస్ట్రార్లపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడి ఏసీబీకి పట్టుబడిన వారు ఉన్నారు. సస్పెన్షన్లు, ఏసీబీ కేసులు.. ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 2014 నుంచి 2019వరకు జరిగిన స్టాంపుల కుంభకోణంలో రూ.80లక్షలకు అక్రమాలు జరిగాయి. ఇందుకు కారణమైన మొత్తం 12మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సబ్‌రిజిస్ట్రార్లతోపాటు ఇతర సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఏళ్లకేళ్లుగా రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు లేకపోవడం, బదిలీలు జరిగినా.. డిప్యూటేషన్లతో ఉమ్మడి జిల్లాలోనే ఏదో ఒక కార్యాలయానికి బదిలీపై వెళ్లడం సర్వసాధారణమైపోయింది. నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి బదిలీలు జరగాలి. ఐదేళ్లు, పదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారి ఒక్కరు కూడా ఉమ్మడి జిల్లాలో లేకపోవడం గమనర్హం. ఆసిఫాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సాయి వివేక్ గతంలో ఆదిలాబాద్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనే ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. అంతకుముందు విజయకాంత్రావు తొమ్మిదేళ్లకు పైగా ఇక్కడ పని చేశారు. ఆయన డిప్యూటేషన్‌పై ప్రస్తుతం నిర్మల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భైంసా సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న రామ్‌రాజ్‌పై అక్రమ భూముల రిజిస్ట్రేషన్లపై పలు ఆరోపణలు రావడంతో ఆయనను ఇటీవల ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న లక్ష్మీకి ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. లక్సెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ ఇక్బాల్ సెలవుల్లో ఉండగా ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా రతన్ విధుల్లో చేరారు. గత నెల 11న ఒకే రోజు ఈయన 39 రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది. రియల్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చని ఫిర్యాదులు రావడంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో శేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న అప్పారావు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భూమి రిజిస్ట్రేషన్ చేశారనే ఫిర్యాదుతో సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న మురళీని ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించారు. మురళీపై కూడా అవినీతి కేసులో ఏసీబీ విచారణ సాగుతోంది. ఖానాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి గతంలో నిర్మల్ సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని తేలడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కొ న్నాళ్లకు ఆయనే ఖానాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా వ చ్చారు. గత మూడేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఓ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా ఫిర్యాదులు వచ్చాయి. చదవండి: ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా.. -
‘ఆపదలో ఇచ్చిన సొమ్ము, ఇవ్వనంటే ఎలాగా..’
సాక్షి,ఖమ్మం: వైరాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మంగళవారం హై డ్రామా నెలకొంది. అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ భానోతు సరోజిని అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన తండ్రి చావుబతుకుల్లో ఉన్నాడని చెప్పి భుక్యా బాలాజీ అనే వ్యక్తి సరోజిని దగ్గర రెండేళ్ల క్రితం రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ బాలాజీ అప్పు చెల్లించలేదు. నెల క్రితం నిలదీయగా.. ఇంటిని అమ్మేసి అప్పు తీరుస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇంటిని అమ్మేశాడు. కానీ, సరోజిని వద్ద తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. నేడు బాలాజీ అమ్మిన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండటంతో తన తల్లితో కలిసి సరోజిని వైరాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుంది. ఆపదలో ఇచ్చిన సొమ్ము, ఇవ్వనంటే ఎలాగా.. తనకు న్యాయం జరగడం లేదని చెప్తూ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడున్నవారు ఆమెకు అడ్డుపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సరోజిని ఆవేదన వ్యక్తం చేసింది. వడ్డీ అవసరం లేదని, రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టిన అసలు ఇచ్చినా చాలునని వాపోయింది. -
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
సాక్షి, కర్నూలు(సెంట్రల్) : కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డాక్యుమెంట్ రైటర్ల సమ్మెతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ కార్యాలయాల పరిధిలో రోజుకు ఒక్కో దానిలో 50కి పైగా రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ప్రభుత్వానికి ఒక్కో కార్యాలయం నుంచి రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే డాక్యుమెంట్ రైటర్లపై సోమవారం ఏసీబీ దాడి చేసి 14 మంది నుంచి రూ.1.54 లక్షలు స్వాధీనం చేసుకోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. ఏదో బతుకుదెరువు కోసం రైటర్లుగా స్థిరపడిన తమపై ఏసీబీ దాడి చేశారని, బలవంతంగా జేబుల్లో ఉన్న డబ్బులను తీసుకెళ్లారని ఈనెల 14 నుంచి సమ్మెలోకి వెళ్లిపోయారు. దీంతో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేసేవారు లేకపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. ఏదో బ్యాంకు మార్టిగేజ్‌కు సంబంధించిన సేవలు మాత్రం అందుబాటులో ఉండడం..అవి కూడా సింగిల్ డిజిట్ దాటడడం లేదు. దీంతో ఒకప్పుడూ వందలాది మంది క్రయ, విక్రయదారులతో కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జనాలు లేక బోసిపోతున్నాయి. రెండు కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి రోజులో దాదాపు రూ. 10 లక్షల ఆదాయం వచ్చేది. అయితే రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఒక్కో దాని నుంచి రోజుకు రూ.10 వేలు దాటడడం లేదు. ఈ నెల 14 నుంచి నేటి వరకు అంటే 4 రోజుల్లో రూ.40 లక్షల ఆదాయం ఉండాల్సి ఉండగా 80 వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ దాడులను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీం సాహెబ్ తెలిపారు. సమ్మెను ఈనెల 21వ తేదీ వరకు కొనసాగిస్తామని చెబుతున్నారు. -
కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
సాక్షి, కర్నూలు: కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దళారుల ప్రమేయంతో అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కూడా ముడుపులు ముట్టజెబుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఏసీబీ డీఎస్పీ నాగభూషణ్ నేతృత్వంలో సీఐలు గౌతమి, ఖాదర్‌బాషా తదితరులు పాలుపంచుకున్నారు. జిల్లా పరిషత్‌లో జరిగిన స్వయం దస్తావేజుల తయారీ అవగాహన సదస్సుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులందరూ హాజరు కావడంతో కార్యాలయంలో ఎవరూ ఏసీబీ అధికారులకు దొరకలేదు. కార్యాలయంతో పాటు ఆవరణలో 14 మంది డాక్యుమెంట్ రైటర్లు లావాదేవీలు నిర్వహిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1.57 లక్షల అనధికారిక నగదును సీజ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్న ఏసీబీ అధికారులు .. సుమారు గంట సేపు తనిఖీలు నిర్వహించారు. కొన్ని రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు క్రయవిక్రయదారుల నుంచి అధికంగా వసూలు చేసిన నగదును సీజ్ చేశారు. అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది మాత్రం డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దందాను నడిపిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక దాడి చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నివేదికను తయారు చేసి.. తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
రైటర్లదే రాజ్యం..
సాక్షి, అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదని.. వారి ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ నేటికీ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల హవానే కొనసాగుతోంది. వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. అక్కడి అధికారులు..సిబ్బందికి అ‘ధన’పు సాయం అందించడంలో వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్రమాల సంగతి బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా వారి ఇళ్లకు సంబంధిత మొత్తాన్ని చేర్చడంలో వారిదే ప్రధాన పాత్ర. డాక్యుమెంట్ రైటర్లతో సంధానకర్తలుగా ప్రైవేటు వ్యక్తులు కొందరు అక్కడే ఉంటూ వారు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొందరు రిజిస్ట్రార్లే ప్రైవేటు వ్యక్తులకు నెలనెలా కొంత మొత్తం చెల్లించి తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారని, ప్రజల నుంచి వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటమట కార్యాలయంలో 12 మంది... సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు లేనిదే పని కావడం లేదు. వారి ఆధ్వర్యంలో మామూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవినీతి మరక అంటకుండా... వారి జేబుల్లోకి డబ్బులు దర్జాగా చేరుతున్నాయి. వారధులుగా డాక్యుమెంట్ రైటర్లు అనధికార విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. అందులో రాష్ట్రంలోనే ఆదాయంలో ప్రథమ వరుసలో నిలిచే విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడుల సమయంలో ఏకంగా 12 మంది డాక్యుమెంట్ రైటర్లు దొరికారు. వారి నుంచి రూ. 3.41 లక్షలను స్వాధీనం చేసుకోవడంతో ఏ స్థాయిలో ఈ దందా జరుగుతోందో ఆర్థమవుతోంది. నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదు. కానీ అక్కడ ప్రతి పని వారి ద్వారానే జరుగుతోంది. వీరు అధికారికంగా పనిచేసే అవకాశం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయాల సమీపంలో కేంద్రాలను ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన పార్టీలకు సేవలు అందించవచ్చు. కానీ పూర్తిగా వారే చక్రం తిప్పుతూ డబ్బులు గుంజుతున్నారు. ఆశ్రయించకపోతే కొర్రీలు.. ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకునే పార్టీలు(అమ్మకం, కొనుగోలుదారులు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని చలానా రూపంలో అందజేస్తే చాలు అంటోంది. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత డాక్యుమెంట్లు పార్టీల చేతికి వచ్చేయాలి. ప్రభుత్వ నిబంధన ఇలా ఉన్నా పార్టీలు నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లడం లేదు. అనధికారికంగా కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేసుకున్న డాక్యుమెంట్ రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్ రాయించిన వారి వద్ద వెయ్యి నుంచి సంబంధిత ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజీ రూపంలో రైటర్లు వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పేరుతో స్టాంప్ డ్యూటీ చెల్లించే మొత్తంలో ఒక శాతం మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ చెప్పినట్టు చేస్తే..పని సాఫీగా అయిపోతుంది. కాదూ కూడదంటే...కార్యాలయ సిబ్బంది సవాలక్ష కొర్రీలు పెడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని క్రయ, విక్రయదారులు వారు అడిగినంత ఇచ్చుకొని పని పూర్తి చేయించుకుంటారు. వసూలైన మొత్తం రోజంతా రైటర్ల దగ్గరే ఉంచుకొని సాయంత్రానికి సిబ్బందికి అందజేస్తుంటారు. నకిలీ డాక్యుమెంట్ రైటర్ల పనే... పాత తరం డాక్యుమెంటరీ రైటర్లు ఇలా భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని అనధికార విధుల చేసేవారు కాదు. లైసెన్స్డ్ నెంబర్ కలిగిన డ్యాక్యుమెంట్ రైటర్లు తప్పు చేయాలంటే బయపడేవారు. ఉన్నతాధికారులు తప లైసెన్స్ రద్దు చేస్తారేమోన న్న భయం వారిలో ఉండేది. అలా జరిగితే అవమానంగా భావించి పనిచేసేవారు. కాలక్రమంలో ప్రభుత్వం లైసెన్స్ విధానం రద్దు చేయటంతో ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారం ఎత్తి అనధికార దందాను మొదలు పెట్టారు. చాలావరకు రియల్ ఎస్టేట్ చేసేవారే వీరిని మెల్లగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చొప్పించి తమ పనిని సులువుగా చేయించుకుంటున్నారు. నకిలీ డాక్యుమెంట్ రైటర్ల వల్ల అసలు రైటర్లు చెడ్డపేరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆఫీస్‌లోకి నో ఎంట్రీ..! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులకు అనుమతి నిషేధం. డాక్యుమెంట్ రైటర్లు, వారి ఏజెంట్లు కొన్ని ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోంది. అటువంటివి మా దృష్టికి వస్తే సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతిని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. –శ్రీనివాసమూర్తి, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ, కృష్ణా జిల్లా -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం ఎప్పుడో..?
సాక్షి, జైనథ్: భూముల రిజిస్ట్రేషన్ అంటేనే ఓ పెద్ద తతంగం..దీని కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. ఛలాన్ కట్టడం...సాక్షులను రప్పించడం..ఇలా ఎన్నో ఇబ్బందులు మనం సాధారణంగా చూస్తుంటాం.. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా అధికారుల చేయి తడపందే పనులు జరగవనేవి ఎవరూ కాదనలేని సత్యం.. ఇవన్నీ చేసి పెట్టేందుకు బ్రోకర్‌ను వెతకడం... నేరుగా వెళితే పనులు జరగకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా నానా తంటాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించుకోవడం మరో తలనొప్పిగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మండల కేంద్రాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పిన ప్రభుత్వం దీంట్లో భాగంగానే 2018లో మండల కేంద్రంలో సైతం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దీంతో మండల వాసులు రిజిస్ట్రేషన్ సేవలు ఎప్పుడు ప్రారంభమౌతాయా? అని ఎదురు చూస్తున్నారు. రూ. 6లక్షలతో కార్యాలయంలో వసతులు మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంగా తయారు చేసారు. కొత్తగా నిర్మించిన స్త్రీశక్తి భవనం ఐకేపీకి కేటాయించడంతో ఈ పాత భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసారు. బయట, లోపల రంగులు వేయడంతో పాటు అవసరమైన మేర గదులను తయారు చేస్తున్నారు. ఈ భవనంలో కంప్యూటర్లు, ఇతర పరికరాలకు ఏసీ తప్పనిసరి కావడంతో, ప్రత్యేకంగా కిటికీలు, అద్దాలు బిగించి రెండు ఏసీ యూనిట్లు అమర్చారు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కోసం ప్రత్యేకమైన క్యాబిన్, వినియోగదారుల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేసారు. స్లాబ్ కొంత శిథిలావస్థకు చేరడంతో వాటర్‌ప్రూఫ్ రసాయనాలతో పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. రూ. 6లక్షల ఖర్చుతో ఈ పాత భవనం పూర్తిగా ఆధునిక హంగులతో మెరిసిపోతుండటంతో మండల కేంద్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా ఉండటంతో రాత్రి వేళ మందుబాబులకు అడ్డగా మారింది. భవనం ముందరి భాగంలో వరండా ఉండటంతో రాత్రుళ్లు సిట్టింగ్ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ భవనం చుట్టుపక్కల మందు బాటిళ్లు, డిస్పో గ్లాసులు, ఖాళీ వాటర్ ప్యాకెట్లతో నిండిపోయింది. గంటలోపే మ్యుటేషన్.. మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అందుబాటులోకి వస్తే ఏదైన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన గంటలోపే మ్యుటేషన్ కూడా చేసేలా ఏర్పాటు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మిన వ్యక్తి పట్టపాస్ బుక్ నుంచి భూమి తొలగించి, కొన్న వ్యక్తి పాస్‌బుక్‌లో భూమిని కలపడం పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగిపోతుంది. అక్కడే ఇద్దరికి కొత్త పాస్‌బుక్‌లు కూడా ప్రింట్ తీసి ఇస్తారు. దీంతో ఇరువర్గాల వాళ్లు రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి తీరనుండటంతో పాటు పారదర్శకత పెరిగి, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని చెబుతున్నారు. దీంతో మండల వాసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదు.. ఉన్నత అధికారుల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభానికి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. మండల కేంద్రంలో ఇప్పటికే కార్యాలయం ఏర్పాటు చేశాం. కార్యాలయానికి కావాల్సిన కంప్యూటర్లు, ఏసీ, ఇతరత్ర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కార్యాలయాన్ని ప్రారంభించి, సేవలు మొదలు పెడుతాం. –సత్యనారాయణ యాదవ్, తహసీల్దార్ -
రిజిస్ట్రార్ కార్యాలయాల కుదింపునకు రంగం సిద్ధం..!
15 నుంచి 5కు తగ్గనున్న కార్యాలయాలు అగమ్యగోచరంలో 450 కుటుంబాలు ‘ప్రైవేటు’గా రిజిస్ట్రార్ కార్యాలయ పనులు! అయినవారికి కట్టబెట్టేందుకు టీడీపీ నేతల సన్నాహాలు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ శాఖపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ శాఖ పనులన్నీ తమకు అనుకూలమైన ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థకు కట్టబెట్టెందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ సంస్థ సూచనల మేరకు జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 5కు కుదించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కంప్యూటీరీకరణ చేస్తున్నామంటూ బయటకు ప్రచారం చేస్తూనే పనులన్నీ సంస్థకు అప్పగించి నెలనెలా ముడుపులు అందుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. నేతల ధన దాహానికి జిల్లాలోని వందలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్ల ఉన్నాయి. వీటిలో ఒక్కో డివిజన్లో ఐదేసి చొప్పున రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని కార్యాలయాల నుంచి ఆదాయం అధికంగానే వస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కరే డీఐజీగా పని చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. కొత్తగా రిజిస్ట్రార్ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కార్పొరేట్ సంస్థ సూచనల మేరకు కార్యాలయాలను ఐదుకు తగ్గించి శ్రీకాకుళం డివిజన్లో రెండు, టెక్కలిలో ఒకటి, పాలకొండలో ఒకటి, ఇచ్ఛాపురంలో ఒకటి పెట్టేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రైవేటు’ వ్యక్తుల ఆదాయార్జనకే కార్యాలయాలన్నీ ఒక చోటకు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు పరిస్థితి ప్రశ్నార్థకం.. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స»Œ æరిజిస్ట్రార్‌తో పాటు మరో 6 నుంచి 8 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అంతే కాకుండా జిల్లా కేంద్రం రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఎస్టాబ్లిస్‌మెంట్ సిబ్బంది, వీరితో ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 20 మందికి పైమాటే. కార్యాలయాలు కుదిస్తే ఉద్యోగులు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖను అప్పగించిన ప్రైవేటు కంపెనీకి సంబంధించిన వ్యక్తులను నియమిస్తారని బోగట్టా. అందోళనలో డాక్యుమెంట రైటర్లు గత కొన్నేళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటీకరణ, కార్యాలయాల కుదింపును వ్యతిరేకిస్తున్నారు. ఉపాధి కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 450 కుటుంబాలకు పైబడి ఈ వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామని, నోటికాడ కూడు తీసేయొద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. ఉసురు తీయొద్దు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలొకి వచ్చాక ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఉద్యోగులను ఊడదీయడం సరికాదు. నిరుద్యోగుల ఉసురు తీయొద్దు. ఏళ్ల తరబడి ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం. రిజిస్ట్రార్ కార్యాలయాలను కుదించి రైటర్ల బతుకులు రోడ్డున పడేయకండి. మాతో పాటు మా మీద ఆధారపడి బతుకుతున్న వారంతా నాశనమయిపోతారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇవ్వండి. అందరినీ తొలగించి ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు కట్టబెట్టడం సరికాదు. రైటర్ల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం విరమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. –బలగ పెంటయ్య, దస్తావేజు లేఖరుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదేశాలు రాలేదు... జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను బ్యాక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ విధానంలో కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారికంగా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే తప్ప స్పష్టత రాదు. – కె.నాగమణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లో అగ్నిప్రమాదం
-
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
హిందూపురం (అనంతపురం జిల్లా): హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కార్యాలయంలోని విలువైన కంప్యూటర్లు, డాక్యుమెంట్లతో పాటు ఫర్నిచర్ కూడా కాలిబూడిదైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. -
దస్తావేజు లేఖర్ల వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
– ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు – దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి ఒంగోలు సబర్బన్ : దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ ధ్వజమెత్తారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వేమూరి కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం దస్తావేజు లేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం దస్తావేజు లేఖర్లపై కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి వస్తున్న దస్తావేజు లేకర్ల వ్యవస్థను రూపు మాపాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. స్థిరాస్తి విక్రయాలతో పాటు ఇతర రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ ద్వారా చేయించుకోవాలని చూడటం ప్రజలను ఇబ్బంది పెట్టడమేనన్నారు. రోడ్డున పడనున్న కుటుంబాలు సంఘ రాష్ట్ర కార్యదర్శి జి.వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వందలాది మంది కుటుంబాలు ఏళ్ల తరబడి ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాయని, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తే ప్రజలు అవస్థలు పడటంతో పాటు దస్తావేజు లేఖర్లకు జీవనోపాధి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు పెళ్లూరి మాలకొండ నరసింహారావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ సుబ్బారావు, సభ్యులు మహ్మద్, నాగభూషణంతో పాటు జిల్లా కార్యదర్శి శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారి మహంకాళి వీరబ్రహ్మాచారి, ములుకుట్ల నాగేశ్వరరావు, అడపా శ్రీనివాసరెడ్డి, షేక్ ఇద్రీజ్, గౌరవాధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరావు, జీఎస్ భావనారాయణ, ఎస్కే దాదాసాహెబ్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షునిగా పెళ్లూరి మళ్లీ ఎన్నిక దస్తావేజు లేఖర్ల జిల్లా సదస్సు సందర్భంగా పెళ్లూరి మాలకొండ నరసింహారావును మళ్లీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పెళ్లూరిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి తెలిపారు. ఆయనతో పాటు చీరాలకు చెందిన హేమారావును కూడా రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
వైఎస్ఆర్ జిల్లా: బద్వేల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. నిన్నటి నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఈ రోజు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ ఏసీబీ అధికారులు నలుగురు స్టాంప్ వెండర్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ నలుగురు స్టాంప్ వెండర్స్ నుంచి రూ. లక్షా 22 వేల 220 లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ గురువారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో కార్యాలయంలో అదనంగా ఉన్న రూ. 70 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతో పాటు కార్యాలయంలో ఉన్న ఏడుగురు బయటి వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. -
ఆ బోసి నవ్వులు ఇక లేవు..
ప్యాపిలి, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని పాలబుగ్గల ఆ చిన్నారికి ఏడాదికే నూరేళ్లు నిండాయి. తన బుడిబుడి నడకలతో బోసినవ్వులతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఆ పాప విగతజీవిగా మారి తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. మండల కేంద్రం ప్యాపిలిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీళ్ల బకెట్లో పడి షెరితాజ్ (1) మృతి చెందింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసముంటున్న బషీర్, కౌసర్‌కు ముగ్గురు కుమార్తెలు. టైలర్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న బషీర్ గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉండగా భార్య ఆరుబయట ఇరుగు పొరుగుతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంత వరకు తల్లి ఒల్లోనే ఉన్న చిన్నారి షెరితాజ్ బుడి బుడి నడకలతో బాత్రూంలోకి వెళ్లింది. రోజులాగే బాత్ రూంలోకి వెళ్లి ఆడుకుంటుందిలే.. అనుకున్న తల్లి మాటల్లో పడి చిన్నారిని మరిచిపోయింది. నీళ్ల బకెట్లో బాటిల్‌ను తీసుకునే ప్రయత్నంలో ఆ చిన్నారి బకెట్లోకి పడి పోయింది. బకెట్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ బాలిక తల నీళ్లలో మునగటంతో ఊపిరాడక మృతి చెందింది. చిట్టి చెల్లిని తమతో పాటు ఆడించుకునేందుకు ఇళ్లంతా వెతికిన అక్కలు రేష్మా, రుక్సానాలు బాత్రూంలో తలకిందులుగా బకెట్లో పడిన చిన్నారిని చూసి కేకలు వేశారు. ఒక్క ఉదుటున అక్కడికి చేరిన తల్లిదండ్రులు బాలికను చూసి హతాశులయ్యారు. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ తల్లి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు బాలిక తల్లిని హుటాహుటిన డోన్ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహం వద్ద అమ్మమ్మ బీబీ రోదనలు మిన్నంటాయి.