సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభం ఎప్పుడో..? | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభం ఎప్పుడో..?

Published Thu, Mar 7 2019 12:27 PM

When Did Begin the Sub-Registrar Office In Adilabad - Sakshi

సాక్షి, జైనథ్‌: భూముల రిజిస్ట్రేషన్‌ అంటేనే ఓ పెద్ద తతంగం..దీని కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. ఛలాన్‌ కట్టడం...సాక్షులను రప్పించడం..ఇలా ఎన్నో ఇబ్బందులు మనం సాధారణంగా చూస్తుంటాం..  అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా అధికారుల చేయి తడపందే పనులు జరగవనేవి ఎవరూ కాదనలేని సత్యం.. ఇవన్నీ చేసి పెట్టేందుకు బ్రోకర్‌ను వెతకడం... నేరుగా వెళితే పనులు జరగకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా నానా తంటాలు పడి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న భూమిని రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్‌ చేయించుకోవడం మరో తలనొప్పిగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మండల కేంద్రాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో తహసీల్దార్‌కే రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పిన ప్రభుత్వం దీంట్లో భాగంగానే 2018లో మండల కేంద్రంలో సైతం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దీంతో మండల వాసులు రిజిస్ట్రేషన్‌ సేవలు ఎప్పుడు ప్రారంభమౌతాయా? అని ఎదురు చూస్తున్నారు.

రూ. 6లక్షలతో కార్యాలయంలో వసతులు
మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయాన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయంగా తయారు చేసారు. కొత్తగా నిర్మించిన  స్త్రీశక్తి భవనం ఐకేపీకి కేటాయించడంతో ఈ పాత భవనంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసారు. బయట, లోపల రంగులు వేయడంతో పాటు అవసరమైన మేర గదులను తయారు చేస్తున్నారు. ఈ భవనంలో కంప్యూటర్లు, ఇతర పరికరాలకు ఏసీ తప్పనిసరి కావడంతో, ప్రత్యేకంగా కిటికీలు, అద్దాలు బిగించి రెండు ఏసీ యూనిట్లు అమర్చారు. దీంతో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కోసం ప్రత్యేకమైన క్యాబిన్, వినియోగదారుల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేసారు.

స్లాబ్‌ కొంత శిథిలావస్థకు చేరడంతో వాటర్‌ప్రూఫ్‌ రసాయనాలతో పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. రూ. 6లక్షల ఖర్చుతో ఈ పాత భవనం పూర్తిగా ఆధునిక హంగులతో మెరిసిపోతుండటంతో మండల కేంద్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా ఉండటంతో రాత్రి వేళ మందుబాబులకు అడ్డగా మారింది. భవనం ముందరి భాగంలో వరండా ఉండటంతో రాత్రుళ్లు సిట్టింగ్‌ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ భవనం చుట్టుపక్కల మందు బాటిళ్లు, డిస్పో గ్లాసులు, ఖాళీ వాటర్‌ ప్యాకెట్లతో నిండిపోయింది.


గంటలోపే మ్యుటేషన్‌..
మండల కేంద్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అందుబాటులోకి వస్తే ఏదైన భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయిన గంటలోపే మ్యుటేషన్‌ కూడా చేసేలా ఏర్పాటు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మిన వ్యక్తి పట్టపాస్‌ బుక్‌ నుంచి భూమి తొలగించి, కొన్న వ్యక్తి పాస్‌బుక్‌లో భూమిని కలపడం పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరిగిపోతుంది. అక్కడే ఇద్దరికి కొత్త పాస్‌బుక్‌లు కూడా ప్రింట్‌ తీసి ఇస్తారు. దీంతో ఇరువర్గాల వాళ్లు రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి తీరనుండటంతో పాటు పారదర్శకత పెరిగి, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని చెబుతున్నారు. దీంతో మండల వాసులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇంకా ఆదేశాలు రాలేదు..
ఉన్నత అధికారుల నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభానికి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. మండల కేంద్రంలో ఇప్పటికే కార్యాలయం ఏర్పాటు చేశాం. కార్యాలయానికి కావాల్సిన కంప్యూటర్లు, ఏసీ, ఇతరత్ర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కార్యాలయాన్ని ప్రారంభించి, సేవలు మొదలు పెడుతాం.
–సత్యనారాయణ యాదవ్, తహసీల్దార్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement