ఆ బోసి నవ్వులు ఇక లేవు.. | Household walks catering for toddlers... | Sakshi
Sakshi News home page

ఆ బోసి నవ్వులు ఇక లేవు..

Jan 17 2014 3:27 AM | Updated on Sep 2 2017 2:40 AM

అభంశుభం తెలియని పాలబుగ్గల ఆ చిన్నారికి ఏడాదికే నూరేళ్లు నిండాయి. తన బుడిబుడి నడకలతో బోసినవ్వులతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఆ పాప విగతజీవిగా మారి తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది.

ప్యాపిలి, న్యూస్‌లైన్:  అభంశుభం తెలియని పాలబుగ్గల ఆ  చిన్నారికి ఏడాదికే నూరేళ్లు నిండాయి. తన బుడిబుడి నడకలతో బోసినవ్వులతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఆ పాప విగతజీవిగా మారి తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది.
 
 మండల కేంద్రం ప్యాపిలిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీళ్ల బకెట్‌లో పడి  షెరితాజ్ (1)  మృతి చెందింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసముంటున్న బషీర్, కౌసర్‌కు ముగ్గురు కుమార్తెలు. టైలర్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న బషీర్ గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉండగా భార్య ఆరుబయట ఇరుగు పొరుగుతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంత వరకు తల్లి ఒల్లోనే ఉన్న చిన్నారి షెరితాజ్ బుడి బుడి నడకలతో బాత్‌రూంలోకి వెళ్లింది. రోజులాగే బాత్ రూంలోకి వెళ్లి ఆడుకుంటుందిలే.. అనుకున్న తల్లి మాటల్లో పడి చిన్నారిని మరిచిపోయింది. నీళ్ల బకెట్‌లో బాటిల్‌ను తీసుకునే ప్రయత్నంలో ఆ చిన్నారి బకెట్‌లోకి పడి పోయింది.
 
 బకెట్‌లో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ బాలిక తల నీళ్లలో మునగటంతో ఊపిరాడక  మృతి చెందింది. చిట్టి చెల్లిని తమతో పాటు ఆడించుకునేందుకు ఇళ్లంతా వెతికిన అక్కలు రేష్మా, రుక్సానాలు బాత్‌రూంలో తలకిందులుగా బకెట్‌లో పడిన చిన్నారిని చూసి కేకలు వేశారు. ఒక్క ఉదుటున అక్కడికి చేరిన తల్లిదండ్రులు బాలికను చూసి హతాశులయ్యారు. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ తల్లి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు బాలిక తల్లిని హుటాహుటిన డోన్ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహం వద్ద అమ్మమ్మ బీబీ రోదనలు మిన్నంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement