'ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది'

Woman Cheating and Jump With 11 Lakhs in Meerpet Hyderabad - Sakshi

సాక్షి, మీర్‌పేట (రంగారెడ్డి): అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఇచ్చిన డబ్బుకు పదింతలు అధికంగా ఇస్తానని నమ్మించి రూ.11 లక్షలతో ఓ మహిళ, కొందరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన మీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం కస్తూరికాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (43) వృత్తిరీత్యా వ్యాపారి. నందిహిల్స్‌లో నివాసముండే ఇతని స్నేహితుడు మహేశ్‌.. రాజు అనే ఓ వ్యక్తిని శ్రీనివాస్‌రెడ్డికి పరిచయం చేశాడు.

రాజుకు తెలిసిన నగరంలోని ఓ మహిళకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు కలిసి రూ.11 లక్షలు పోగు చేశారు. మధ్యవర్తులుగా ఉన్న రాజు, వినోద్, మహమ్మద్‌ఖాన్‌ల ద్వారా ఈ నెల 1వ తేదీన రాత్రి సదరు మహిళను హస్తినాపురం విశ్వేశ్వరయ్య కాలనీలోని శ్రీనివాస్‌రెడ్డి సోదరుడి షెడ్డుకు పిలిపించి పూజలు చేయించారు. ముందుగా రూ.5 వేలు పూజలో పెడితే రూ.50 వేలుగా మారుస్తానని మహిళ చెప్పగా.. వారు ఆ నగదు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత వాటిని రూ.50 వేలుగా చేసి చూపించింది.

చదవండి: (వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్‌)

నమ్మకం కలిగించిన తర్వాత మిగతా డబ్బును కూడా పూజలో పెట్టాలని చెప్పగా శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులు రూ.11 లక్షలు పూజలో పెట్టారు. పథకం ప్రకారం సదరు మహిళ అందరం కలిసి భోజనం చేద్దామని వారికి చెప్పింది. భోజనం చేస్తుండగా 15 మంది వ్యక్తులు రెండు కార్లలో అక్కడికి వచ్చి పోలీసులమని బెదిరించి శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం సదరు మహిళ పూజలో ఉంచిన రూ.11 లక్షలు తీసుకుని కారులో వచ్చిన వారితో పాటే పారిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top