హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్య

Wife And Husband Brutally Murdered In Peddapalli - Sakshi

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా నరికి చంపిన దుండగులు 

పెద్దపల్లి జిల్లాలో ఘోరం 

వామన్‌రావు మరణ వాంగ్మూలం  

మంథని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, మరో ఇద్దరిపై కేసు..

పోలీసుల అదుపులో ఓ నిందితుడు 

స్థానిక వివాదాలే హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమిక అంచనా 

సాక్షి, కరీంనగర్‌/రామగిరి(మంథని): పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులను అత్యంత పాశవికంగా హత్యచేశారు. కొబ్బరిబొండాలు కోసే కత్తులతో ఇరువురిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పెద్దపల్లి జిల్లా మంథని మండ లం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకట నాగమణి ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామానికి చెందిన వ్యక్తులే ఈ హత్యలకు పాల్పడినట్టు వామన్‌రావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావులపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.  

నంబర్‌ లేని కారులో మాటువేసి.. 
హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు బుధవారం మధ్యాహ్నం తమ కారు(టీఎస్‌–10 ఈజే 2828)లో మంథని నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. వీరి రాకపై పక్కా సమాచారం తెలుసుకున్న నిందితులు కల్వచర్ల సమీపంలోని ప్రధాన రహదారిపై రైస్‌మిల్లులు దాటిన తర్వాత కొత్తగా నిర్మించిన రోడ్డు చివరన నంబర్‌ లేని నల్లరంగు కారులో మాటు వేశారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వామన్‌రావు దంపతులు ప్రయాణిస్తున్న కారు కొత్తగా నిర్మించిన రోడ్డుపైకి ఎక్కే క్రమంలో వేగం తగ్గింది. దీంతో నిందితులు ఒక్కసారిగా తమ కారును అడ్డంగా పెట్టి కొబ్బరిబోండాలు కోసే కత్తులతో కిందికి దిగారు. తొలుత వారి కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో భయభ్రాంతులకు గురైన వామన్‌రావు కారు డ్రైవర్‌ సతీష్‌ డోరు తీసుకుని పారిపోగా.. లోపలున్న దంపతులపై దుండగులు కత్తులతో దాడిచేశారు.

వెంకట నాగమణి కారులోనే కుప్పకూలిపోగా.. వామన్‌రావును కారు నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఆయనపై దాడి జరుగుతున్నంతసేపూ రోడ్డుకు ఇరువైపులా మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. కత్తులతో దాడి చేస్తున్న దుండగులకు భయపడి వారిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు వామన్‌రావు చనిపోయాడని భావించిన తర్వాత నిందితులు కారులో మంథని వైపు వెళ్లిపోయారు. వెంటనే స్థానికులు 108 వాహనంలో బాధిత దంపతులను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలో కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 


మంథనిలో పుట్ట మధు ఆధ్వర్యంలో జరిగిన కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో నిందితుడు కుంట శ్రీనివాస్‌ (హత్యకు కొన్ని గంటల ముందు) 

వామన్‌రావు మరణ వాంగ్మూలం.. 
దాడిలో తీవ్రంగా గాయపడిన వామన్‌రావు.. చనిపోవడానికి ముందు స్థానికులతో మాట్లాడారు. తాను గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు అని, తనపై దాడి చేసింది అదే గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌ అని చెప్పారు. ఆయన మాటలను స్థానికులు మొబైల్‌లో రికార్డు చేశారు. తనకు మంచినీళ్లు ఇవ్వాలని వామన్‌రావు కోరడం.. ఆ సమయంలో నీళ్లు తాగితే ప్రమాదమని స్థానికులు చెప్పడం.. అనంతరం వారిని 108 వాహనంలోకి ఎక్కించడం కూడా ఆ వీడియోలో రికార్డైంది. ఆ వీడియోలో వామన్‌రావు చెప్పిన మాటలను మరణ వాగ్మూలంగా తీసుకుంటున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తెలిపారు. అనంతరం వామన్‌రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్‌ను, ఏ–2గా అక్కపాక కుమార్‌ను, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇరువురి మధ్య విభేదాలేంటి? 
ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌ గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎంపీటీసీగా ఉన్నప్పటి నుంచే వామన్‌రావుతో విభేదాలున్నాయి. ఇటీవల శ్రీనివాస్‌కు చెందిన ఇంటి నిర్మాణంపై వామన్‌రావు ఫిర్యాదుచేసి, పనులను నిలిపివేయించారు. అలాగే గుంజపడుగులోని రామస్వామి గోపాలస్వామి దేవాలయ నిర్వహణ దశాబ్దాలుగా వామన్‌రావు కుటుంబసభ్యులే చేసుకుంటుండగా.. కొందరు మరో కమిటీని ఏర్పాటుచేసి గుడికి చెందిన పనులు చేస్తున్నారు. దీనిపై వామన్‌రావు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదుచేసి, ఆ పనులు కూడా నిలిపివేయించారు. గుంజపడుగు చెరువు శిఖం భూమిలో అనుమతి లేకుండా పెద్దమ్మ గుడి నిర్మాణం చేపడుతున్నారని ఆయన పంచాయతీకి ఫిర్యాదు చేశారు. ఆ పనులు కూడా ఆగిపోయాయి. దీంతో గ్రామంలో తమకు అడ్డు వస్తున్నారనే కక్షతోనే శ్రీనివాస్‌ తదితరులు ఈ దారుణానికి పాల్పడ్డారని వామన్‌రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  
 
నిందితులు ఎవరైనా వదిలేది లేదు.. 
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిని హత్యచేసిన ఘటనపై పోలీస్‌ యంత్రాంగం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. çహత్యా ఘటన సమయంలో తీసిన వీడియోలో వామన్‌రావు చెప్పిన మాటలను మరణ వాంగ్మూలంగా తీసుకుంటున్నాం. ఇప్పటికే ఏ2 అక్కపాక కుమార్‌ను అదుపులోకి తీసుకున్నాం. కుంట శ్రీనివాస్, వసంతరావు కోసం ఆరు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. పాత కక్షలతోనే హత్యలు జరిగాయని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చాం. రాజకీయ కోణంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. పోలీసుల ప్రమేయం ఉందంటూ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలు తప్పు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదు. – సత్యనారాయణ, సీపీ, రామగుండం 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top