స్పీడ్‌ పెంచిన ‘కరోనా’.. లక్షణాలు మాత్రం లేవు!

Why Are Corona Virus Cases Rising Despite Vaccination in India - Sakshi

30 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ అంచనా

లక్షణాలు కనిపించని కేసులే 90%

అందుకే వ్యాప్తి పెరిగిందంటున్న అధికారులు 

సీరియస్‌ కేసులు తక్కువే.. ఆందోళన వద్దు 

మాస్కులు, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచన 

మరో రెండు నెలల్లో కేసులు బాగా పెరిగే అవకాశం 

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్‌ వైరస్‌ సోకినా ఎలాంటి లక్షణాలూ బయటపడకుండా ఉంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మొదటి దశ కంటే ఇప్పుడు 30% ఎక్కువ వేగంగా వైరస్‌ విస్తరిస్తున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ర్యాండమ్‌గా ఏదో ఒకచోట గుమిగూడిన 100 మందికి అక్కడికక్కడే పరీక్షలు చేస్తే.. అందులో అటుఇటుగా 15 నుంచి 20 మందికైనా వైరస్‌ బయటపడే పరిస్థితి ఉందని భావిస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో 90% మందికి అసలు లక్షణాలే కనిపించడం లేదని.. ఎవరికి వైరస్‌ ఉందో, ఎవరికి లేదో తెలియక వారి ద్వారా ఇతరులకు వైరస్‌ సోకుతోందని స్పష్టం చేసింది. వచ్చే 2 నెలల్లో భారీగానే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. అయితే ఇప్పుడు వస్తున్న కేసుల్లో ఆరోగ్య పరిస్థితి సీరియస్‌ అవుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్యాధికారులు చెప్తున్నారు. 

నాడు వేసవిలో.. నేడూ వేసవిలోనే.. 
గత వేసవిలోనే కరోనా విజృంభించగా ఇప్పుడూ అదే స్థాయిలో ప్రభావం ఉంటుందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకాగా.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదీ మార్చి నుంచి కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల ఒకటిన 163 కరోనా కేసులురాగా.. 30న 684 కేసులు నమోదయ్యాయి. ఈ 30 రోజుల్లో 64 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,477 పడకలుంటే.. 864 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో కేవలం సీరియస్‌ కేసులనే తీసుకుంటున్నారు. అంటే ఐసీయూలో చేర్చాల్సిన రోగులకే చికిత్స చేస్తున్నారు. ఆక్సిజన్, ఐసోలేషన్‌ పడకలను నింపడం లేదని అక్కడి వైద్యాధికారులు అంటున్నారు. చదవండి: (ప్రమాదంలో యావత్‌ దేశం.. కేంద్రం ఆందోళన)

30 శాతం ఎక్కువ వేగంతో వైరస్‌ వ్యాప్తి 
సెకండ్‌ వేవ్‌లో కరోనా అంచనాలకు మించి విస్తరిస్తోంది. ఏ మాత్రం లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ ఉంటున్నవారి సంఖ్య ఎక్కువైంది. మొదటిసారి కంటే సెకండ్‌ వేవ్‌లో 30 శాతం ఎక్కువ వేగంతో కరోనా విస్తరిస్తోందని అంచనాలు ఉన్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఊహించని స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సెకండ్‌ వేవ్‌లో నమోదయ్యే కేసుల్లో సీరియస్‌గా మారేవి తక్కువగా ఉంటున్నాయి. ఇది ఊరటనిచ్చే అంశం. నిబంధనల మేరకు అవకాశం ఉన్నవారంతా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. అందరూ మాస్క్‌ ధరించాలి. కరోనా జాగ్రత్తలు పాటించాలి. అవే మనల్ని కరోనా నుంచి రక్షిస్తాయి. గురువారం నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తాం. రాష్ట్రంలో వారు 80 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో ఇప్పటికే 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశాం. ఇంకా 70 లక్షల మందికి వేయాల్సి ఉంది. 
డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు 

కరోనాను తక్కువగా అంచనా వేశాం 
రాష్ట్రంలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు లేకుండా ఉండేవే ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు కరోనా రాగానే భయంతో అనేక మంది ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. బెడ్లు నిండిపోతున్నాయి. పరిస్థితి సీరియస్‌ అయి ఐసీయూలోకి వెళ్లేవారిలో యువకులు అధికంగా ఉండటం ఆందోళనకరం. పెద్దలు భయంతో మాస్కులు, కరోనా జాగ్రత్తలు తీసుకుంటుంటే.. యువకులు ఏమీ కాదన్న భావనతో నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణం. రానున్న రోజుల్లో ఊహించని స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కరోనాను తక్కువ అంచనా వేశాం అనిపిస్తుంది. 
 డాక్టర్‌ కృష్ణ ప్రభాకర్, చీఫ్‌ జనరల్‌ ఫిజీషియన్, సిటీన్యూరో ఆస్పత్రి, హైదరాబాద్‌ 

టీకా వేసుకుంటే సేఫ్‌.. 
రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ గురువారం నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. ఇప్పటివరకు కేవలం 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్లు పైబడిన వారికీ టీకాలు వేస్తున్నారు. ఇక నుంచి వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు దాటిన అందరికీ ఇస్తారు.  

‘ప్రైవేటు’లో బెడ్లు ఫుల్‌.. 
హైదరాబాద్‌లో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘కరోనా’ పడకలన్నీ దాదాపు నిండిపోయాయి. సెకండ్‌ వేవ్‌లో తీవ్రత తక్కువగానే ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నా, పెద్దగా లక్షణాలు లేకపోయినా.. కరోనా బాధితులు మాత్రం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పడకల కొరత మొదలైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top