వీకెండ్‌ వస్తే.. రేవ్‌ మొదలు! 

Weekend Secret Rave Parties In Pubs And Resorts In Hyderabad - Sakshi

హైదరాబాద్‌లోని పబ్స్, రిసార్టుల్లో గుట్టుగా రేవ్‌ పార్టీలు  

ఓ పక్క డ్రగ్స్‌.. మరోవైపు అశ్లీల నృత్యాలు

పర్యాటకం ముసుగులోనూ అసాంఘిక కార్యకలాపాలు 

తాజాగా ‘ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌’కలకలం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్‌ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్‌ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మేడ్చల్, హయత్‌నగర్‌లలో ఇలాంటి ఘటనలు బయటపడగా.. తాజాగా ఆదివారం వెలుగులోకి వచ్చిన ‘ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌’ఉదంతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని తొమ్మిది పబ్స్‌లో మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా తమకు సమాచారం ఉందని గతంలో పోలీసులే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. 

డబ్బులు ఎరవేసి.. 
రేవ్‌ పార్టీల నిర్వాహకులు ఓ వైపు డ్రగ్స్‌ సమకూర్చడంతోపాటు డబ్బున్నవారి పిల్లలను ఆకర్షించేందుకు అమ్మాయిలతో నృత్యాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాది రాష్ట్రాలు, మెట్రో నగరాలకు చెందిన యువతులకు డబ్బులు ఎరవేసి రప్పిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే టూరిస్టు వీసాలపై విదేశీ యువతులనూ పిలిపిస్తున్నారు. ఇలాంటి పార్టీల కోసం ప్రముఖులు, వీఐపీల పిల్లల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు సూత్రధారులు ఎక్కడా దొరకకుండా వ్యవస్థీకృతంగా దీనంతటినీ నడిపిస్తుండటం గమనార్హం. పోలీసులు దాడులు చేసినా.. అమాయక యువతులు, పార్టీలో పనిచేసే సిబ్బంది మాత్రమే పట్టుపడుతున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో ఇలాగే ముగ్గురు రష్యా యువతులు చిక్కారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. సైబరాబాద్‌ పరిధిలోని శామీర్‌పేటలో 43 మంది, మేడ్చల్‌లోని ఓ రిసార్ట్‌లో 39 మంది, హయత్‌నగర్‌ పరిధిలోని మరో రిసార్ట్‌లో 11 మంది ఇలాగే పోలీసులకు దొరికారు. రేవ్‌ పార్టీల పేరిట వ్యభిచారం కూడా చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

కొత్త ట్రెండ్‌గా డ్రగ్‌ టూర్స్‌ 
రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్స్‌ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అయితే ‘హెచ్‌–న్యూ’పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టారు. డ్రగ్‌ పెడ్లర్స్‌ కదలికలు, మాదకద్రవ్యాలు దొరకడం కష్టమవడంతో కొత్తగా ‘డ్రగ్‌ టూర్స్‌’పెరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్‌ వినియోగదారుల్లో చాలా మంది గోవాతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నారని అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్‌ ప్రాంతంలో నిర్ణీత సందర్భాల్లో రేవ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తున్నారని.. దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్‌ వినియోగదారులు హాజరవుతున్నారని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top