నిర్మల్‌లో మళ్లీ జోరు వాన

Weather Report: Heavy Rain In Nirmal District - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: నిర్మల్‌ జిల్లాలో ఆదివారం తగ్గుముఖం పట్టిన వాన సోమవారం మళ్లీ మొదలైంది. రోజంతా వర్షం పడింది. నీట మునిగిన ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. మామడ మండలంలో దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించి.. స్థానికులతో మాట్లాడారు.

ముథోల్‌ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ ముషరఫ్‌ పర్యటించారు. టాక్లి, బిద్రెల్లి, కిర్గుల్‌(బి) గ్రామాల్లో ముంపు బాధితులతో మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, వంతెనలను పరిశీలించి.. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ పర్యటించి.. నాగాపూర్, మందపల్లి చెరువు కట్టలను, వేణునగర్‌ గ్రామం వద్ద కాల్వను పరిశీలించారు. 

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రామప్ప సరస్సు నీటిమట్టం 26 అడుగులకు చేరింది. గణపురం మండలం గణపసముద్రం చెరువు 31 అడుగట్లు గరిష్ట సామర్థ్యం కాగా.. సోమవారం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకుంది. పాకాల సరస్సు పూర్తి స్థాయి మట్టానికి దగ్గరగా వచ్చింది. 

భద్రాద్రిలో గోదావరి వరద: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో పలుచోట్ల సోమవారం కూడా వానలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 913 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. అయితే అంతకు మూడు రెట్లు నష్టం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదా వరి వరద రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వందకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు వరదలో మునిగినట్టు అంచనా వేశారు. ముంపు తలెత్తే ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తు న్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ భద్రాచలంలో  సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top