కథ వింటే కన్నీళ్లే.. ఇల్లు గడవక కూలీ పనులకు గ్రామ సర్పంచ్‌

Warangal Woman Sarpanch daily wage With financial problem - Sakshi

వరంగల్: ఆ గ్రామానికి ఆమె ప్రథమ పౌరురాలు. ఇల్లు గడవక తోటి కూలీలతో కూలీ పనులకు వెళ్తోంది. ఓ పక్క గ్రామసర్పంచ్‌గా విధులు నిర్వహిసూ్తనే, మరో పక్క కుటుంబ పోషణ కోసం దినసరి కూలీగా పనులకు వెళ్తుంది.  మండలంలోని వెంకంపాడు గ్రామం ప్రత్యేక తెలంగాణ తర్వాత కొత్త జీపీగా ఏర్పాటైంది. రిజర్వేషన్‌ కారణంగా 2019 జనవరి 25న సర్పంచ్‌గా తప్పెట్ల ఉప్పమ్మ ఎన్నికైంది. పంచాయతీకి మొదటి సర్పంచ్‌గా ఎన్నిక కావడంపై ఆనాడు ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. సర్పంచ్‌ ఎన్నికల్లో లక్షల్లో చేసిన అప్పులు తీర్చలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా భారమై కుటుంబం దీనస్థితిలోకి వెళ్లింది. గతంలో హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ ఏరియాలో వైజాగ్‌ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్‌ప్రసాద్‌ వద్ద సర్పంచ్‌ భర్త వెంకన్న వాచ్‌మెన్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు.

 ఈ క్రమంలో వెంకంపాడు కొత్తగా జీపీగా ఏర్పాటైందని, గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం మీకే ఉందని కొందరు గ్రామపెద్దలు ఆశ చూపించారు. వారు చెప్పిన మాటలు విని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని పట్టణం నుంచి మూట ముల్లె సదురుకొని పల్లెకు బాట చేరుకున్నారు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులతో పాటు మరికొన్ని అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత మూడేళ్లుగా అరకొర వచ్చిన నిధులతో గ్రామాభివృద్ధికి సరిపోక మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏడాదిగా చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయామని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. సర్పంచ్‌గా గౌరవ వేతనం అందడం లేదు.

 పెళ్లీడుకొచి్చన కూతురుకు పెళ్లి చేద్దామన్న చేతిలో చిల్లి గవ్వ లేదు. గ్రామంలో సెంట్‌ భూమి లేదు. డబుల్‌ ఇంటిని ఇస్తారన్న ఆశతో ఉన్న ఇంటిని నేలమట్టం చేసి రేకుల షెడ్డు వేసుకున్నామని ఆవేదన చెందింది. ఇదే క్రమంలో అప్పులోల్లు ఇంటి చుట్టు తిరుగుతుంటే పరువు పోతుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది ఏమిలేక దినసరి కూలీగా మిర్చి వేరడానికి ఎర్రటి ఎండలో రూ.200 కూలీకి వెళ్తున్నట్లు బోరున విలపించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే పాల్గొని, మిగిలిన సమయంలో దినసరి కూలీ పనులకు వెళ్తుంది. నాలాంటి కష్టాలు ఏ ప్రజాప్రతినిధికి కూడా రాకూడదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్పందించిపెండింగ్‌లో పంచాయతీ అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే విడుదల చేయించి తమను కష్టాల ఊబిలోనుంచి గట్టెక్కించాలని సర్పంచ్‌ ఉప్పమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top