క్రమబద్ధికరణ చాటున 7 వేలకుపైగా కుటుంబాలకు తీరని వ్యథ
గత ప్రభుత్వం నిలిపివేసిన కారుణ్య నియామకాల కోసం 1,500 కుటుంబాల ఎదురుచూపులు
రిటైర్ అయి విధులు నిర్వహిస్తున్న 4 వేల మంది వీఆర్‌ఏలు... రెగ్యులరైజ్ అయిన 3 నెలల నుంచి మూడేళ్ల లోపే రిటైరయిన 2 వేల మంది
న్యాయం చేయాలని కోరుతూ మూడేళ్లుగా సీసీఎల్‌ఏ చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక పద్ధతిన చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే జీవితాలు బాగుపడతాయని అందరూ ఆశిస్తారు... కానీ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) విషయంలో మాత్రం ఉద్యోగాల క్రమబద్ధీకరణ నిరాశను మిగిల్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్రమబద్ధికరణ అనంతరం దాదాపు 7 వేల వీఆర్‌ఏల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ వీఆర్‌ఏలు, వారి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
తరాలుగా... సహాయకులుగా: రాష్ట్రంలో పేద వర్గాలకు చెందిన వేలాది మంది తరతరాలుగా మసూ్కరులుగా, సుంకరులుగా, నీరటిలుగా రెవెన్యూ శాఖలో సేవలందిస్తున్నారు. వీరితోపాటు 2012, 2014లో రాత పరీక్ష ద్వారా మరికొందరు గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఎంపికయ్యారు. వీరి పోరాటం కారణంగా గత ప్రభుత్వం 2023, ఆగస్టు నెలలో ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. వీఆర్‌ఏల వ్యవస్థను రద్దు చేసి వారిని ప లు శాఖల్లో జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, లస్కర్లుగా నియమించింది. ఇ ప్పుడు ఈ క్రమబద్ధీకరణే కొందరు వీఆర్ ఏల జీవితాల్లో కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది.
⇒ ఉద్యోగాల క్రమబద్ధికరణకు ముందు అప్పటి ప్రభుత్వం వీఆర్‌ఏల కారుణ్య నియామకాలను నిలిపివేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వీఆర్‌ఏలుగా పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇలా కారుణ్య నియామకాల కోసం దాదాపు 1,500 మంది ఎదురు చూస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
⇒ క్రమబద్ధికరణ సమయానికి 61 సంవత్సరాలు నిండిన వారిని రెగ్యులరైజ్ చేయలేదు. కానీ మండల రెవెన్యూ కార్యాలయాల్లో వారు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఇలా రెగ్యులరైజ్ కాకుండానే ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 4వేల మంది ఉంటారని అంచనా.
⇒ మరో సమస్య ఏమిటంటే... మసూ్కరు ఉద్యో గం జీవితాంతం ఉంటుంది. దానికి రిటైర్‌మెంట్ ఉండదు. కానీ క్రమబద్ధికరణ నిబంధనల ప్రకారం 2వేల మంది వరకు రిటైరయ్యారు. వీరిలో చాలా మంది రెగ్యులర్ ఉద్యోగులుగా 3 నెలల నుంచి మూడేళ్లు మాత్రమే పనిచేయగలిగారు.
⇒ ఈ మూడు కేటగిరీలకు చెందిన వీఆర్‌ఏల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం కూడా శీతకన్ను వేసింది. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సహా ఉన్నతాధికారులెవరూ వీరి గోడును పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
కొసమెరుపేమిటంటే...
ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయి కుటుంబాలకు దూరంగా, ఇతర జిల్లాలకు వెళ్లి పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు, లస్కర్లు, అటెండర్లకు ఇంతవరకు ప్రొబేషన్ డిక్లేర్ కాకపోవడంతో వారు ఇంక్రిమెంట్లు పొందేందుకు వీలు లేకుండా పోయింది. కనీసం అధికారికంగా సెలవులు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం.


