ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం

Vemulawada Muslims Key Decision On Food Menu In Marriage - Sakshi

ఇకపై ఆడపిల్లల పెళ్లి విందులో ఇదే మెనూ

పెరుగుతున్న ఖర్చులకు తీర్మానంతో ముకుతాడు

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు

సాక్షి, కరీంనగర్‌/వేములవాడ: ఓవైపు కరోనా వైరస్‌ ఉధృతి, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరల వల్ల పుట్టిన రోజు వేడుక ఎంత చిన్నగా చేసినా ఎంత లేదన్నా రూ. 10 వేలు ఆవిరి అవుతున్నాయి. అలాంటిది ఇక పెళ్లితంతుకు అయ్యే ఖర్చు గురించి చెప్పనక్కర్లేదు. అందులోనూ తినుబండారాలు, కూరలు, వంటలు ఎక్కువగా చేసే ముస్లిం ఇళ్లల్లో పెళ్లిళ్లకు ఖర్చు మరీ ఎక్కువవుతుంది. రానురాను ఈ వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు బాధల నుంచి బయటపడేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మతపెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ పెళ్లి అయినా సరే ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.  
చదవండి: తెలంగాణ: ఓపీ చూసి.. మందులు రాసి! 

నిర్ణయం వెనక ఏం జరిగింది? 
సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో పెళ్లిలో అమ్మాయి తరఫువారు పసందైన రుచులతో తీరొక్క తీపి పదార్థాలు సిద్ధం చేస్తారు. చికెన్, మటన్‌తో అనేక రకాల వంటలు, బిర్యానీ, చపాతీ రోటీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్, ఐస్‌క్రీం, షేమియా, షీర్‌ కుర్మా.. ఇట్టా చెప్పుకుంటే పోతే.. అబ్బో ఐటం లిస్టు గోల్కొండ కోట అంత పెద్దగా ఉంటుంది. కానీ కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు మందగించాయి. ఎంతో మంది నష్టాలు చవిచూశారు.

ఈ క్రమంలో ఆడపిల్ల పెళ్లిలో ఒకప్పటిలా రకరకాల ఆహార పదార్థాలతో విందులు ఏర్పాటు చేయడం భారమైంది. పెళ్లికూతురుకు పుట్టింటి వారు కట్నకానుకలు లేదా సారె కింద ఇచ్చే వాటి కంటే ఈ విందులో వడ్డించే వెరైటీల ఖర్చు అనేక రెట్లు అధికమైంది. ఎంత తక్కువలో వెరైటీలు ప్లాన్‌ చేసినా.. ఎంతలేదన్నా.. రూ. మూడున్నర నుంచి రూ.నాలుగున్నర లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చుపై పేద, సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
చదవండి: కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న గిరిని ‘ఎత్తేయొచ్చు’!

భగారా, చికెన్‌ లేదా మటన్, ఒక స్వీట్‌ 
వివాహంలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రించేందుకు ఇటీవల వేములవాడలోని షాదీఖానాలో 8 మజీద్‌ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. స్థానికంగా జరిగే విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్‌ లేదా మటన్‌ మాత్రమే వడ్డించాలని తీర్మానించారు. గతంలో మాదిరి గంపెడు స్వీట్లు చేయకుండా ఏదైనా ఒకే స్వీటు పెట్టాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top