‘కొత్త’ కొత్తగా కొన్నదీ.. | Variety of purchases during New Year celebrations | Sakshi
Sakshi News home page

‘కొత్త’ కొత్తగా కొన్నదీ..

Jan 2 2025 4:33 AM | Updated on Jan 2 2025 4:33 AM

Variety of purchases during New Year celebrations

నూతన సంవత్సరం వేడుకల్లో వెరైటీ కొనుగోళ్లు

మారుతున్న అభిరుచులకు తగ్గట్టు కొత్త పోకడలు 

చిప్స్, ఫ్రూట్‌ బీర్, కోకాకోలా ఇతర శీతలపానీయాలు,  ఆలూబుజియా, వివిధ రకాల ఖారా ఐటమ్స్‌ (నమ్‌కీన్‌) కొనుగోలు

ఐస్‌క్యూబ్స్, కండోమ్స్, చేతికి వేసే సంకెళ్లు, బ్లైండ్‌ ఫోల్డ్స్‌కు ఆర్డర్లు

అత్యధికంగా ద్రాక్ష పండ్ల విక్రయం

బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌ బాస్కెట్‌ ఇతర ప్లాట్‌ఫామ్స్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో నూతన సంవత్స­రాన్ని ఆహ్వానిస్తూ జరుపుకొన్న వేడుకలు కొత్త పంథాలో సాగాయి.  హైదరాబాద్‌తో ఇతర మెట్రో నగ­రాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం.. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి 12 గంటలకు.. ఆ తర్వాత కూడా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై వివిధ రకాల వస్తువుల ఆర్డర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిప్స్, ఫ్రూట్‌ బీర్, కోకాకోలా ఇతర శీతలపానీ­యాలు, ఆలూబుజియా వివిధ రకాల ఖారా ఐట­మ్స్‌ (నమ్‌కీన్‌), ఐస్‌క్యూబ్స్, కండోమ్స్, చేతికి వేసే సంకెళ్లు, బ్లైండ్‌ ఫోల్డ్స్‌తో పాటు ద్రాక్ష పండ్లు.. అత్యధికంగా అమ్ముడైనట్టు వివి­ధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

వీటితో పాటు కొత్త ఏడాది ఇచ్చే వివిధ రకాల కానుకలకు కూడా గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు.. ఆ తర్వాత చేసిన ఈ ఆర్డర్ల తీరు చూస్తుంటే.. ఏ స్థా­యి­లో కొత్త సంవత్సరం వేడుకలను జరుపు­కొన్నా­రో, ఎలాంటి నూతన పోకడలకు ఆసక్తి చూపారో స్పష్టమవుతోంది. ప్రస్తుతం భారత్‌లో క్విక్‌కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిమిషాల్లోనే వివిధ రకాల వస్తువుల­ను వినియోగదారుల ఇళ్లకు చేరవేస్తున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా.. విభిన్నంగా వేడుకలను జరుపుకొనే తీరు, స్నేహితులు, సన్నిహితులతో తు­ళ్లుతూ, ఆడుతూ, పాడుతూ గడిపేందుకు విని­యోగదారులు ఇచ్చిన ప్రాధాన్యం ఏ స్థాయి­లో ఉందో.. వారు చేసిన ఆర్డర్లే నిదర్శనం. 

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం వివిధ రకాల వస్తువుల ఆర్డర్లు ఇవ్వడం.. వాటిలో కొత్త తరహావి ఉండటం గమనార్హం. దీనిపై జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌ బాస్కెట్‌ ఇతర ప్లాట్‌ఫామ్స్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో వెల్లడించిన అంశాలు స్పష్టత ఇస్తున్నాయి. కరోనా కాలంలో ఈ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ లభించింది. మహానగరాలు, ప్రథమ శ్రేణి నగరాలు, ప్రధాన పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరా­లకు కూడా వీటి సేవలు వేగంగా అందుబాటులోకి రావడం తెలిసిందే. 

12 ద్రాక్ష పండ్ల సెంటిమెంట్‌ 
డిసెంబర్‌ 31న ఒక్కసారిగా ద్రాక్ష పండ్ల కోసం ఉప్పెనలా ఆర్డర్లు వచ్చి పడుతుండడంతో ఆశ్చర్య­పోవడం బ్లింకిట్‌ సీఈవో అల్బింద్‌ ధిండ్సా వంతైంది. ఇంతమందికి ఒక్కసారే ద్రాక్ష తినాలనే కోరిక ఎందుకు కలిగిందా? అని ఆయన ఆశ్చర్యపో­యారు. తమ ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వస్తువుల్లో ద్రాక్ష పండ్లు ముందువరసలో నిలవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 

ఎందుకీ హఠా­త్‌ పరిణామమని ఆరా తీస్తే ఆసక్తికరమైన విష­యాలు తెలిశాయి. కొత్త ఏడాది అడుగిడేందుకు ముందు.. అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్ల­ను తిని.. కోరిన కోరిక లేదా ఆకాంక్షను వెలిబుచ్చితే అది వాస్తవరూపం దాల్చుతుందనేది పురాతన ఆచారమట. అమెరికన్‌ టీవీ సీరియల్‌ ‘మాడ్రన్‌ ఫ్యామిలీ’లో సోఫియా వెర్గార పాత్ర ద్వారా దీనికి ప్రాచుర్యం కల్పించడమే ద్రాక్ష ఆర్డర్లు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కూడా..
మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో నిమిషానికి 853 చిప్స్‌ ఆర్డర్లు వచ్చినట్టు, ఒక కస్టమర్‌ కళ్లకు కట్టే గంతలు (బ్లైండ్‌ ఫోల్డ్‌), చేతి సంకెళ్లు (హాండ్‌కఫ్స్‌) ఆర్డర్‌ చేసినట్టు, మంగళవారం రాత్రి 7.41 గంటలకు ఐస్‌ డెలివరీ తారస్థాయికి చేరుకుందని, నిమిషంలో 119 కేజీల ఐస్‌ దిమ్మెను డెలివరీ చేసినట్టు సంస్థ కో–ఫౌండర్‌ ఫణికిషన్‌ తెలియజేశారు. బిగ్‌బాస్కెట్‌ కూడా నాన్‌–అల్కాహాలిక్‌ బేవరేజెస్‌ అమ్మకాల్లో భారీ పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. 

ఇవి 552 శాతం అధికంగా కాగా.. డిస్పోజబుల్‌ కప్స్, పేŠల్‌ట్స్‌ వంటి విక్రయాల్లో 325 శాతం పెరుగుదల, సోడా, మాక్‌టెయిల్స్‌ విక్రయాలు 200 శాతం పెరిగినట్టుగా తెలియజేసింది. అంతకు ముందుతో పోల్చితే ఐస్‌క్యూబ్‌ల ఆర్డర్లు చెన్నైలో రెండింతలు నమోదైనా, చల్లనైన శీతలపానీయాల స్టాక్‌ పెట్టుకోవడంలో ఇంకా ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ కంటే చెన్నై వెనుకబడి ఉందని ఫణికిషన్‌ ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

2.3 లక్షల ఆలూబుజియా ప్యాకెట్లు
మొత్తంగా చూస్తే.. 2.3 లక్షలకు పైగా ఆలూబుజియా ప్యాకెట్లు, మంగళవారం రాత్రి 8 గంటల సమయానికే 6,834 ఐస్‌క్యూబ్‌ ప్యాకెట్లను వినియోగదారులకు డెలివరీ చేసినట్టు బ్లింకిట్‌ సీఈవో అల్బింద్‌ ధిండ్సా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. నూతన సంవత్సరం వేడుకలను ఫుల్‌గా ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమైనవారిలో.. ముఖ్యంగా మందుబాబులు హ్యాంగోవర్‌ను అధిగమించేందుకు 22,322 పార్టీ స్మార్ట్‌ టాబ్లెట్స్‌ (హ్యాంగోవర్‌ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగపడే హెర్బల్‌ గోళీలు), 2,434 ఈనో ప్యాకెట్లను ఇళ్లకు తెప్పించుకున్నట్లు బ్లింకిట్‌ వివరించింది. స్నాక్స్, అల్కహాల్‌తో పాటు 45 వేల మినరల్‌ వాటర్‌ బాటిళ్లను బ్లింకిట్‌ ద్వారా సరఫరా చేశారు.

కండోమ్స్‌కు సంబంధించి చాక్లెట్‌ ఫ్లేవర్లలో అత్యధికంగా 39.1 శాతం, స్ట్రాబెర్రీ 31 శాతం, బబుల్‌గమ్‌ 19.8 శాతం, ఇతర రకాలు 10.1 శాతం ఆర్డర్‌ చేసినట్టు చెప్పారు. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని తమ సంస్థ అనేక మైలురాళ్లను దాటిందని అల్బింద్‌ ధిండ్సా పేర్కొన్నారు. 

ఒకరోజులో అత్యధిక ఆర్డర్ల రికార్డ్, ఒక్కొక్క నిమిషానికి, ఒక్కొక్క గంటకు అత్యధికంగా ఆర్డర్లు పొందడం, డెలివరీ పార్ట్‌నర్లకు అత్యధికంగా టిప్స్‌ ఇచ్చిన రోజుగా నమోదు కావడం, అత్యధికంగా చిప్స్, ద్రాక్ష పండ్లను విక్రయించిన రికార్డ్‌ను సొంతం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement