ట్రాన్స్‌మిషన్‌ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్‌

TSTRANSCO plans for conversion of 132KV line into 220 KV - Sakshi

పైలట్‌ ప్రాజెక్టు సక్సెస్‌.. 132 కేవీ నుంచి 220 కేవీకి సామర్థ్యం పెంపు

ఎస్‌ఆర్పీసీ సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్‌ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్‌మిషన్‌ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్‌మిషన్‌ లైన్ల సామర్థ్యం పెంపు (అప్‌గ్రెడేషన్‌)కు సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ, ఎస్‌ఆర్పీసీ చైర్మన్‌ ప్రభాకర్‌రావు తెలిపారు.

మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్‌ రీజియన్‌ పవర్‌ కమిటీ (ఎస్‌ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్‌ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్‌ లోసాగ్‌ కండక్టర్స్‌ (హెచ్‌టీఎల్‌ఎస్‌) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్‌ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్‌టీఎల్‌ఎస్‌ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్‌రావు వివరించారు. హెచ్‌టీఎల్‌ఎస్‌ తీగలు 210 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్‌ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి.  

ఎన్టీపీసీపై ఎస్‌ఆర్పీసీ అసంతృప్తి
2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్‌ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్‌ఆర్పీసీ చైర్మన్‌ హోదాలో ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top