తెలంగాణ ఆర్టీసీలో ‘61 ఏళ్ల’ చర్చ

TSRTC Discussion Of Retirement Age Of RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, 2019 సమ్మె సమయంలోనే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 60 ఏళ్లకు పెంచింది. మళ్లీ 61 ఏళ్ల పెంపు ప్రతిపాదన రావడంతో ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కానీ వయసు పైబడే కొద్దీ బస్సులు నడపటం కష్టంగా ఉంటోందని, తమకు వయసు పెంపు అవసరం లేదని డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లలో సింహభాగం మంది మొరపెట్టుకున్నారు. వీలైతే వీఆర్‌ఎస్‌ ప్రకటిస్తే వెళ్లిపోతామని కూడా పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం ఆర్టీసీకి 61 ఏళ్ల వయసు అంశాన్ని వర్తింపచేయకుండా పెండింగులో ఉంచింది. డిసెంబరు 31నుంచి 60 ఏళ్ల ప్రాతిపదికన రిటైర్మెంట్లు మొదలుకానున్నాయి. అయితే పెంపునకు సానుకూలంగా ఉన్నతస్థాయి అధికారులు మరోసారి రిటైర్మెంట్‌ వయసు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించారు.

విషయాన్ని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పువ్వాడతో గురువారం చర్చించి, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపేలా చూడాలని యత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు దాన్ని స్వాగతిస్తుండటం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే కార్మికులు వ్యతిరేకిస్తుండటంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆర్టీసీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

భారమైనా పట్టించుకోని అధికారులు...  
అసలే అప్పట్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కష్టంగా ఉన్న ఆర్టీసీకి 60 ఏళ్ల పెంపు పెద్ద సమస్యగా మారింది. వేయికిపైగా బస్సులను తగ్గించటం, కొత్త బస్సులు కొనకపోవటంతో 4 వేల మందికి పనులే లేకుండా పోయాయి. వయసుపెంపు ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటం వల్ల మరో రెండేళ్లు రిటైర్మెంట్లు లేకపోవడం ఆర్టీసీకి మరింత భారమయ్యింది. అయినా అధికారులు వ్యవస్థను పట్టించుకోకుండా కేవలం తమ పదవీవిరమణ పెంపుపై ఆసక్తి చూపుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top