పడిపోయిన ఆర్టీసీ బస్సుల మైలేజీ  | Sakshi
Sakshi News home page

పడిపోయిన ఆర్టీసీ బస్సుల మైలేజీ 

Published Tue, May 3 2022 4:01 AM

TSRTC Bus Mileage Fallen Down - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా రవాణా సంస్థల్లో అత్యధిక మైలేజీతో దేశవ్యాప్తంగా రికార్డు సొంతం చేసుకుంటూ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు దాన్ని కోల్పోయేలా కనిపిస్తోంది. లీటరు డీజిల్‌కు సగటున 5.4 కి.మీ. మైలేజీ (కేఎంపీఎల్‌) సాధించి ఇటీవలే పురస్కారాన్ని కూడా సాధించింది. కొన్నేళ్లుగా ఈ రికార్డును సొంతం చేసుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఇప్పుడు గతి తప్పింది. ఇప్పుడు అది సగటున 5.2 కంటే తక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. అసలే డీజిల్‌ ధరలు మండిపోయి చమురు ఖర్చును భరించలేకపోతున్న ఆర్టీసీకి ఇప్పుడు మైలేజీ కూడా పడిపోవడం పెనుభారంగా పరిణమించింది.

ఇదే కారణం.. :  గతంలో నిత్యం డిపోల వారీగా డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఉండేది. మైలేజీ ఎక్కువగా సాధించాలంటే డ్రైవింగ్‌ ఎలా ఉండాలన్న విషయంలో సూచనలుండేవి. తక్కువ మైలేజీ తెస్తున్న డ్రైవర్లను గుర్తించి వారికి ప్రత్యేక సూచనలు చేసేవారు. ఇటీవల బల్క్‌ డీజిల్‌ ధరలు భగ్గుమనడంతో బస్సులకు ప్రైవేటు బంకుల్లో డీజిల్‌ పోయిస్తున్నారు. ఇందుకోసం డ్రైవర్‌ తన డ్యూటీ ముగించుకునే సమయంలో పెట్రోలు బంకు వరకు వెళ్లి డీజిల్‌ పోయించుకుని రావాల్సి వస్తోంది. ఈ కారణంతో గంటకుపైగా సమయం వృథా అవుతోంది.

వారి పని సమయం మించిపోతుండటంతో కౌన్సిలింగ్‌ నిలిపేశారు. ఇది మైలేజీపై ప్రభావం చూపుతోంది. దీన్ని గుర్తించిన ఎండీ సజ్జనార్‌ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. డీజిల్‌ కోసం బంకు వరకు వెళ్లకుండా, బంకు యజమానులే చిన్నసైజు ట్యాంకర్ల ద్వారా డీజిల్‌ను డిపోకు తెచ్చి లోపల ఉండే ఆర్టీసీ బంకుల్లో లోడ్‌ చేసే ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి కౌన్సిలింగ్‌ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement