డీజిల్‌ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్‌! తొలుత హైదరాబాద్‌లో ఆటోలకు బ్యాటరీల బిగింపు

TSREDCO Plans To Convert Diesel Vehicles Into Electric Subsidy Facility - Sakshi

5 వేల ఆటోలకు కొత్త రూపు ఇచ్చేందుకు చర్యలు 

తొలుత నగరంలో 500 ఆటోలకు బ్యాటరీల బిగింపు 

రూ.15 వేల సబ్సిడీ అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం  

ఆర్టీసీ బస్సులను కూడా మార్చేందుకు త్వరలో టెండర్లు

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్‌ వాహనలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్‌ రెడ్‌కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 5 వేల ఆటోలకు బ్యాటరీలు బిగించి ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది.

తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 ఆటోలకు బ్యాటరీలు అమర్చాలని భావిస్తోంది. ఒక్కో ఆటోకు రూ.15 వేల సబ్సిడీని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చేందుకు త్వరలో టెండర్లు పిలవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు నెలవారీ అద్దె కింద ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీలర్‌ వాహనాలే తీసుకునేలా చర్యలు చేపడుతోంది.  

కొత్తగా 138 చార్జింగ్‌ కేంద్రాలు 
ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో రాష్ట్రంలో 138 కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్‌ రెడ్కో కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో 118, వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో చెరో 10 చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్‌ విధానంతోపాటు పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయనుంది.

హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, పర్యాటక, పౌర సరఫరాల, రోడ్డు, రవాణా శాఖలు తమ పరిధిలో చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనువైన 979 స్థలాలను గుర్తించి టీఎస్‌ రెడ్కోకు జాబితాను అందజేశాయి. జీహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖల స్థలాలను ఇప్పటికే అధీనంతోకి తీసుకోగా, మిగిలిన శాఖలతో రెవెన్యూ షేరింగ్‌ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి రెడ్కో చర్యలు తీసుకుంటోంది. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు 20 మంది ఆపరేటర్లను ఎంప్యానల్‌ చేసుకుంది.  

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీకి రుణాలు 
ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీదారులను ప్రోత్సహించేందుకు 18 బ్రాండ్లతో రెడ్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీదారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంలు, సింగరేణితో కలిసి త్వరలో ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తయారీదారులకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు సహకరించనుంది. ఎలక్ట్రిక్‌ టూ వీలర్లకు ప్రాచుర్యం కల్పించేందుకు త్వరలో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించనున్నామని టీఎస్‌ రెడ్‌కో చైర్మన్‌ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా రుణాలతోపాటు చార్జింగ్‌ కేంద్రాలను మానిటరింగ్‌ చేసే వీలుంటుందని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top