Dalita Bandhu: నెలలో ప్రతిఫలం ఉండే వాటికే..!

TS SC Corporation Said Dalita Bandhu Will Given To Quick Income Business - Sakshi

దళితబంధు యూనిట్లపై ఎస్సీ కార్పొరేషన్‌ కసరత్తు

ఏ యూనిట్‌ ప్రారంభించినా నెల నుంచే రాబడి ఉండాలి

అలాంటి యూనిట్లకే ప్రాధాన్యత  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దళిత బంధు పథకం కింద ఎలాంటి యూనిట్లు ప్రారంభిస్తే సత్ఫలితాలు వస్తాయనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్‌ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఆలోగా యూనిట్లను ఖరారు కోసం చర్యలు వేగవంతం చేసింది. ఎలాంటి యూనిట్‌ ప్రారంభించినా నెల రోజుల నుంచే రాబడి వచ్చే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దాదాపు 47 రకాల యూనిట్లతో ప్రాథమిక జాబితాను రూపొందించింది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... మరిన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఒకట్రెండు రోజుల్లో తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించనుంది. 

సత్వర ఆదాయం వచ్చే వాటికి ప్రాధాన్యత... 
దళిత బంధు కింద ఒక్కో లబ్ధిదారుకు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో లబ్ధిదారులు ప్రారంభించే యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. యూనిట్‌ విలువ రూ. 10 లక్షలకు సరిపడా ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రాధాన్యతా రంగాలు, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే యూనిట్లను ఉదహరిస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ ఒక జాబితాను తయారు చేసింది. ఇందులో 47 రకాల యూనిట్లు ఉన్నాయి.

వ్యవసాయ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, జనరల్‌ స్టోర్స్, హార్డ్‌వేర్‌ షాప్స్, వైద్యం, గ్రోసరీస్, భవన నిర్మాణం, ప్లాస్టిక్‌ యూనిట్లు, స్టీల్, సిమెంట్‌ స్టోర్స్, ఆహారోత్పత్తి యూనిట్లు, హోటల్, రవాణా రంగాలకు చెందిన యూనిట్లు ఇందులో ఉన్నాయి. సాధారణ యూనిట్లకు భిన్నంగా ఈ యూనిట్లను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేలా ఎస్సీ కార్పొరేషన్‌ పథకాలను రూపొందించింది.

ఉదాహరణకు ఇటుక బట్టీ ఏర్పాటు చేస్తే అందుకు తగినట్లుగా రవాణా సౌకర్యం కింద ట్రాలీని కూడా ఈ యూనిట్‌తో జత చేశారు. మొత్తంగా ప్రభుత్వం సాయం చేసే రూ. 10 లక్షలతో యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ తుది జాబితాకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆయా వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసి లబ్ధిదారులు యూనిట్‌లను ఎంపిక చేసుకొని ప్రాజెక్టు రిపోర్ట్‌ సమర్పించేలా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top