తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణం

TS High Court CJ Satish Chandra Sharma Was Sworn in - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌ చంద్ర శర్మ సోమవారం ప్రమాణం చేశారు. గవర్నర్‌ తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు.

జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ... 
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ 1961 నవంబర్‌ 30న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్‌.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్‌ హరిసింగ్‌గౌర్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. మూడు సబ్జెక్ట్‌ల్లో డిస్టింక్షన్‌ సాధించి నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందారు. అదే వర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984, సెప్టెంబర్‌ 1న మధ్యప్రదేశ్‌ బార్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఎల్‌ఎల్‌బీలోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్‌ విషయాల్లో ప్రాక్టీస్‌ చేశారు. 1993లో అడిషనల్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు.

2004లో సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top