టీఆర్‌ఎస్‌లో రచ్చరచ్చ.. పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్‌చల్

వజ్రోత్సవాల్లో దాడి చేసుకున్న నేతలు
ఎమ్మెల్యే తనయుడిపై చర్యలు తీసుకోవాలి
గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ డిమాండ్
శాంతినగర్: జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అధికార పార్టీలో రగడకు దారితీశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్డీఓ రాములు అధ్యక్షతన శుక్రవారం వజ్రోత్సవాలు నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా కొందరు సెల‍్ఫీలు, ఫొటోలు తీసుకుంటుండగా వేదికపై అలజడి రేగింది. ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్‌చల్ చేశారు. సభాప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి సాయిచంద్, ఆయన అనుచరులు, గన్‌మెన్, పీఏలను ఒకవైపు.. ఎమ్మెల్యే అబ్రహం తన యుడు అజయ్, అతడి అనుచరులను మరోవైపు పంపించి గొడవ పెద్దది కాకుండా చూశారు.
అనంతరం సాయిచంద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుమారుడు అజయ్ అనుచరులు తనపై, పీఏ, గన్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పోలీసు ఎస్కార్ట్‌తో అక్కడి నుంచి పంపించారు. దాడి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే, సాయిచంద్ ఎవరి ఆహా్వనం మేరకు వచ్చారని ఎమ్మెల్యే తనయుడు అజయ్ ప్రశ్నించారని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి