పోలీసు శాఖలో వరుస సస్పెన్షన్లు, బదిలీల కలకలం

Transfers In Warangal Police Commissionerate Tension In Officers - Sakshi

ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు కేయూసీ ఎస్‌హెచ్‌ఓ

ఇన్‌చార్జ్‌ ఎస్‌హెచ్‌ఓగా జనార్దన్‌ రెడ్డి నియామకం

కేయూ ఘటనలో నిఘా వర్గాల వైఫల్యంపై సీరియస్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆరు నెలల కాలంలో శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్చలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు కమిషనర్‌గా పి.ప్రమోద్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించాక శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. భూసెటిల్‌మెంట్లు, దందాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరు అధికారులపై ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం అనివార్యమని తేలిన పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే పలువురు సీఐలు, ఎస్‌ఐలపై సస్పెన్షన్, బదిలీల వేటు వేస్తుండగా, ఓ డీసీపీ, ఏసీపీల బదిలీ జరిగింది. అయితే, ఆ తర్వాత వరుసలో ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. 

కేయూసీ ఇన్‌స్పెక్టర్‌పై వేటు
ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్న అధికారులపై వరుస చర్యలు పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారగా, సోమవారం మరొకరిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్‌ చేయడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ డేవిడ్‌ రాజును ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సీపీ ప్రమోద్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సైబర్‌ క్రైం విభాగం ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ముగ్గురు ఎస్‌హెచ్‌ఓలు, నలుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌ వేటు పడింది.

అలాగే, ముగ్గురిని క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలో హన్మకొండ, సుబేదారి, కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కమలాపూర్‌ ఎస్‌హెచ్‌ఓ సస్పెండైన వారిలో ఉండగా, వరంగల్, కాజీపేట కార్యాలయాల పరిధిలో మామూనూరు, ధర్మసాగర్‌ ఎస్‌హెచ్‌ఓలను వీఆర్‌కు అటాచ్డ్‌ అయ్యారు. తాజాగా హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలోని కేయూ పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ డేవిడ్‌ రాజును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.(చదవండి: సొంత శాఖలో అక్రమార్కులపై పోలీసు కథాస్త్రం!)

కేయూసీలో ఘటనపై ఆరా
కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం చోటుచేసుకున్న గొడవ అటు ప్రజాప్రతినిధులు, ఇటు పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చకు దారి తీసినట్లు సమాచారం. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ వినయ్‌భాస్కర్‌ కాన్వాయిని ఏబీవీపీ సభ్యులు అడ్డుకోవడం.. ఆ తర్వాత ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలను సీరియస్‌గా తీసుకున్నట్లు చెబున్నారు. ఈ సందర్భంగా పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో నిఘావర్గాలు కూడా వైఫల్యం చెందాయనే చర్చ సాగుతోంది. ఇదే విషయమై ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేయూ ఘటనపై హైదరాబాద్‌ నుంచి సైతం కీలక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా, ఇది చినికిచినికి గాలివానగా మారిందని తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top