‘కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు’

TPCC Chief Uttam Kumar Reddy Comments On CM KCR - Sakshi

లాయర్ వామన్‌రావు దంపతుల హత్యపై ఫిర్యాదు

సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరిన కాంగ్రెస్ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు.. లాయర్ వామన్‌రావు దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే లాయర్‌ దంపతులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారన్నారు.

ఓ కేసు నిమిత్తం హైకోర్టులో కేసు వేసినందుకే వీరిని చంపారని, పోలీసులు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పుట్టా మధుకు స్థానిక పోలీస్‌ కమిషనర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. సీఎం కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక పోలీసులతో  కేసు ముందుకు సాగదన్నారు. నేరుగా కోర్టు ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని ఆయన వెల్లడించారు. ఈ హత్య ఘటనపై సీజేఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతికి లేఖ రాసామని పేర్కొన్నారు.

ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్‌ చేయలేదు: శ్రీధర్‌ బాబు
లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు అన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ గుంజపడుగు గ్రామానికి చెందిన ఇద్దరు లాయర్ల హత్య జరగడం దురదృష్టకరమన్నారు. శీలం రంగయ్య అనే దళితుడు లాకప్ డెత్‌పై వామన్‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారన్నారు. స్థానిక పోలీస్ కమిషనర్ పట్టించుకోవడం లేదని.. కోర్టు పట్టించుకోవాలని వారు కోరారని, కానీ వారికి ప్రాణాలే పోయాయని పేర్కొన్నారు. రామాలయం భూమి, అంతకుముందు రెండు మూడు ఘటనలకు లింక్ పెడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రమాదం ఉందన్నారు. టెక్నాలజీ పెరిగిందని కేటీఆర్ చెబుతున్నారని, ఆ సెల్‌ టవర్‌ కింద ఉన్న ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
చదవండి:
వ్యవస్థలన్నీ నాశనం 
ఫామ్‌హౌజ్‌లలో ఉన్నా వదిలేది లేదు: బండి సంజయ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top