డిజిటల్‌ చెల్లింపుల్లో మనమే టాప్‌

Top Digital Payments In Telangana Says Beat Of The Progress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘డిజిటల్‌ చెల్లింపు’లు చేసే వారి సంఖ్య విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 44 శాతం జనాభా ‘డిజిటల్‌ పేమెంట్స్‌’ద్వారా తమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ మాధ్యమాల ద్వారా అత్యధికంగా డిజిటల్‌ చెల్లింపులు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ప్రధానంగా నగదు లావాదేవీలు జరిపే సంప్రదాయ దేశంగా ఉన్న భారత్‌లో గత కొన్నేళ్లలో నగదు వినియోగం తగ్గించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఐయితే 2016లో విభిన్న అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావితం చేయడంతో డిజిటల్‌ చెల్లింపులు క్రమంగా ఊపందుకోవడం మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో పాటు హైస్పీడ్‌ డేటా రావడంతో వీటి వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభు త్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తో పాటు, గత ఏడాదిన్నరకు పైగా యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి, జనజీవనాన్ని అస్తవ్య స్తం చేసిన ‘కోవిడ్‌ మహమ్మారి’పరిణామాలతో కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ జెట్‌స్పీడ్‌ను అందుకున్నాయి.  

ఇదీ అధ్యయనం... 
ఐదేళ్ల కాలంలో తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాలు, ఇతర అంశాలపై తాజాగా విడుదలైన ఫోన్‌పే పల్స్‌ ‘బీట్‌ ఆఫ్‌ ద ప్రోగ్రెస్‌’నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా ఈ ఏడాది జులైలో 324 కోట్ల లావాదేవీలతో ›ప్రపంచస్థాయిలోనే రికార్డ్‌ను సృష్టించింది.

 ఇప్పటిదాకా యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ద్వారా (గత జూలై ఆఖరుకు) రూ.6,06,281 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఫోన్‌పే ద్వారా జరిపిన 2,240 కోట్ల లావాదేవీలను ప్రాంతాలు, కస్టమర్ల నివాస ప్రాంతాలు, కేటగిరీ తదితరాలను విశ్లేషించారు. దీంతోపాటు డిజిటల్‌ పేమెంట్స్, వాటి వల్ల తమ జీవితంపై ప్ర«భావం, తదితర అంశాలపై వ్యాపారులు, వినియోగదారులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా, అధ్యయన నివేదికలు, వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు, విశ్లేషణలు, డేటాబేస్‌ తదితర అంశాలన్నింటినీ విశ్లేషించి దేశంలో డిజిటల్‌ చెల్లింపుల తీరుతెన్నులపై ‘పల్స్‌’నివేదికను రూపొందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top