కరోనా పరీక్షలు చేశాకే లోపలికి!

Three Level Security For PM Modi Hyderabad Visit: CP Stephen Ravindra - Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి వచ్చే వారికి పార్టీ పాస్‌లు ఉంటేనే ఎంట్రీ

భద్రతా ఏర్పాట్లపై సమీక్షలో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, నెగెటివ్‌ వస్తేనే లోపలికి అను మతిస్తామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో వీఐపీలు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై స్టీఫెన్‌ రవీంద్ర గురువారం సమీక్షించారు. కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

భేటీ కోసం బీజేపీ జారీ చేసిన పాస్‌లను తీసుకురావాలని, పోలీసులు వాటిని పరిశీలించాకే లోపలికి వెళ్లనిస్తారని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ వస్తే.. పాస్‌ ఉన్నా కూడా లోనికి అనుమతించబోమని తెలిపారు. ఇది బీజేపీ అంతర్గత సమావేశం కావడంతో పరిమిత స్థాయిలో నేతలకు అనుమతి ఉంటుం దని.. ఇతర నేతలు, కార్యకర్తలు, జన సందోహం రావొద్దని సూచించారు. హెచ్‌ఐసీసీలో నాలుగం చెల భద్రత, వీఐపీలు వచ్చే రోడ్ల వెంట మూడం చెల భద్రత ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

పోలీసు పహారాలోకి హోటల్, సభా ప్రాంగణం
భేటీ జరిగే హెచ్‌ఐసీసీ, అతిథులు బసచేసే నోవాటెల్‌ హోటల్‌ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్, జిల్లాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీ, బెటాలియన్‌ పోలీసులు కలిపి ఆరు వేల మందికిపైగా పహారా కాయనున్నారు.

ఇక ప్రధాని, వీవీఐపీల భద్రత కోసం సుమారు 300 మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సిబ్బంది మోహరించనున్నారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా 1,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top