
మరో నలుగురికి తీవ్రగాయాలు
కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
వెల్దండ: పందులను చోరీ చేశారంటూ రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. కల్వకుర్తి మున్సిపాలిటీలోని విద్యానగర్‌కు చెందిన బెల్లంకొండ రాములు (45), కొర్రెడ్డి నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేశ్‌తో పాటు మరో 10మంది పందులను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వెల్దండకు వచ్చారు. అయితే కొన్ని రోజులుగా వీరి పందులు చోరీకి గురవుతున్నాయి.
అయితే చోరీకి గురైన పందులు వెల్దండ మండలం పోతేపల్లికి వెళ్లే దారిలో ఉన్నాయని కొందరు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు అక్కడికి వెళ్లి షెడ్‌లో ఉన్న పందులను చూస్తున్న క్రమంలో మరో వర్గానికి చెందిన మానపాటి వెంకటమ్మ, పవన్‌కుమార్, శివ, అన్వేశ్, దుద్రాక్షల కృష్ణ వారిపై దాడికి దిగారు. కర్రలు, కొడవళ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడటంతో రాములుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేశ్‌లకు తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాములు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన వారికి కల్వకుర్తిలోనే చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పందుల చోరీ ఘటనపై కల్వకుర్తి, వెల్దండ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశామని.. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.