Visnoor Gadi: విస్నూర్‌ దొరకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ.. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి

Telangana Vimochana Dinotsavam: Visnoor Deshmukh Chakali Ilamma History - Sakshi

చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. ఈ చరిత్రలో ఓభాగం జనగామ జిల్లా పాలకుర్తి మండంలోని విస్నూర్‌ గడి.శత్రు దుర్భేద్యమైన ఈ విస్నూర్‌ గడిలో నుంచే చుట్టూ 60 గ్రామాలకు విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన దేశ్‌ముఖ్‌ రాపాక వెంకటరాంచంద్రారెడ్డి పాలన సాగించాడు. ఆయన, ఆయన కుమారుడు బాబుదొర అనేక అరాచకాలు సృష్టించారు. వీరి పాలనపై కడివెండినుంచే తొలి తిరుగుబాటు మొదలైంది.

తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే. ఈయనతో పాటు పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహులు పల్లెపల్లెనా  సంఘాలు ఏర్పాటు చేశాయి. దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసిపెంచుకుంది. దొరసాని ఆదేశంతో వారి అనుచరులు 1946 జులై 4న కాల్పులు జరపడంతో, దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్‌ గాయమైంది. 

రజాకార్లకు, విస్నూర్‌ దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓరకంగా ఉద్యమానికి ఊపిరులూదింది అని చెప్పవచ్చు. 

విస్నూర్‌ గడి దొర రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైద్రాబాద్‌ పారిపోతుండగా, జనగామ రైల్వేస్టేషన్‌లో కాల్చిచంపారు. ప్రజల ప్రతిఘటన 400గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. రజాకార్ల దాడులు, అరాచకాలు మరింతగా పెరిగాయి. తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. చివరకు నైజాం సర్కార్‌ 1948 సెప్టెంబర్‌ 17న కేంద్రంలో విలీనమైంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top