రూ.1,2,5 నోట్లు ఇచ్చేదీ లేదు.. పుచ్చుకునేదీ లేదు

Telangana: Rs.1 2 5 Notes Usage Discontinued Why - Sakshi

అవాస్తవ ప్రచారం, అవగాహన లోపంతో దాదాపుగా నిలిచిపోయిన వాడుక 

రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలదీ ఇదే పరిస్థితి.. 

కానీ అధికారికంగా ఇంకా చలామణీలోనే ఉన్న చిన్న నోట్లు, రూ.10 నాణేలు 

ఆర్బీఐ లెక్కల ప్రకారం ఇప్పటికీ వాడుకలో రూ.382 కోట్ల విలువైన రూపాయి నోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లు చూసి చాలా కాలమైంది కదూ.. అవసలు చలామణీలో ఉన్నాయా? అనే అనుమానం కూడా కలుగుతోంది కదూ.. కానీ ఉన్నాయి. అధికారికంగా చలామణీలో ఉన్నాయి. కానీ ఆ నోట్లు ఇవ్వడం కానీ, పుచ్చుకో వడం కానీ దాదాపుగా జరగటం లేదు. చెల్లుబాటు జరగ డం లేదనే ప్రచారం, నిబంధనలు తెలియకపోవడం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆ దిశగా అవగాహన కల్పించకపోవడం వల్ల..విలువైన నోట్లు ఎందుకూ కొరగానివన్నట్టుగా మారుతున్నాయి.

కానీ ఒకప్పుడు అవే రా జ్యమేలాయంటే అతిశయోక్తి కాదు. 1983–84 సంవత్సరంలో 100 రూపాయల నోట్ల కన్నా 1, 2, 5 రూపాయల నోట్లే ఎక్కువ సంఖ్యలో చలామణి అయ్యాయి. క్రమంగా ఇవి తగ్గుతూ వచ్చినా ఇప్పటికీ.. అంటే 2021– 22 నాటికి కూడా రూ.వందల కోట్ల విలువైన ఈ నోట్లు ఇంకా అధికారికంగా చలామణిలోనే ఉండడం విశేషం. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన భారత ఆర్థిక గణాంకాల నివేదిక (ఇండియన్‌ ఎకానమీ స్టాటిస్టిక్స్‌) 2021–22 ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

నాణేలు కూడా..
ప్రస్తుతం 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇందులో 1, 2, 5 రూపాయల నాణేలకు ఇప్పటికీ విలువ ఉంది. వీటిని ప్రజలు పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. కానీ, 10, 20 రూపాయల నాణేలను మాత్రం ప్రజలు అంగీకరించడం లేదు. అక్కడక్కడా రూ.20 నాణేల పరస్పర మార్పిడి జరుగుతున్నా, రూ.10 కాయిన్‌ ఇస్తే మాత్రం చెల్లదని తిరిగి ఇచ్చేస్తున్నారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ మార్కెట్‌లో రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలు, రూ.674 కోట్ల విలువైన 20 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి.  

నాటి నుంచి నేటి వరకు నోట్లు, నాణేల చలామణి ఇలా.. 
►1983–84లో రూ.198 కోట్ల రూపాయి నోట్లు చలామణిలో ఉంటే ప్రస్తుతం రూ.382 కోట్లు మార్కెట్‌లో ఉన్నాయి.  
►1983–84లో రూ.450 కోట్ల రెండు రూపాయల నోట్లుంటే ఇప్పుడు అవి రూ.853 కోట్లకు చేరాయి. 
►రూపాయి నాణేలు 1983–84లో రూ.303 కోట్లు ముద్రించగా, ఇప్పుడు మార్కెట్‌లో రూ.4,777 కోట్లు ఉన్నాయి.  
►2021–22లో రూ.6,816 కోట్ల విలువైన రెండు రూపాయల నాణేలు, రూ.9,217 కోట్ల విలువైన ఐదు రూపాయల నాణేలు, రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలు, రూ.674 కోట్ల విలువైన 20 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి.  

►ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో రూ.3,431 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు, రూ.27,805 కోట్ల పది రూపాయల నోట్లు, రూ.22,026 కోట్ల 20 రూపాయల నోట్లు, రూ.43,571 కోట్ల విలువైన 50 రూపాయల నోట్లు ఉన్నాయి. 
►1987–88 నుంచి అమల్లోకి వచ్చినప్పుడు బహిరంగ మార్కెట్‌లో రూ.180 కోట్ల విలువైన రూ.500 నోట్లుంటే 2021–22 నాటికి రూ.22,77,340 కోట్ల విలువైన నోట్లను ముద్రించాల్సి వచ్చింది.  

►రూ.100 నోట్ల విషయానికి వస్తే 1983–84లో రూ.11,690 కోట్ల విలువైన నోట్లు ఉంటే ఇప్పుడు రూ.1,81,421 కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. లక్ష కోట్లకు పైగా రూ.200 నోట్లు ఉన్నాయి. 
►వెయ్యి రూపాయల నోట్లను 2000–01 సంవత్సరంలో వాడుకలోకి తెచ్చినప్పుడు 3,719 కోట్ల నోట్లను ముద్రిస్తే పెద్ద నోట్ల రద్దు సమయానికి (2018–19) వాటి విలువ 6,610 కోట్లకు చేరింది. 
►ఇక, రెండు వేల రూపాయల నోట్ల విషయానికి వస్తే వాడుకలోకి వచ్చిన 2016–17లో 6.57 లక్షల కోట్ల విలువైన నోట్లను ముద్రించారు.  

నాణేలు.. నగరం
నాణేల ముద్రణతో భాగ్యనగరానికి అవినాభావ సంబంధముంది. నిజాం కాలంలో సైఫాబాద్‌లో మింట్‌ కాంపౌండ్‌ను ప్రారంభించారు. ఈ మింట్‌ 1997 వరకు ఇక్కడ కొనసాగినా.. ఆ తర్వాత దీన్ని చర్లపల్లికి తరలించారు. ప్రస్తుతం చర్లపల్లిలో నాణేల ముద్రణ సాగుతోంది.  (క్లిక్: ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top