అభయారణ్యాల్లో ‘అండర్‌పాస్‌’లకు అనుమతి 

Telangana Rorest Department Decided To Build Underpasses For Wildlife To Roam Freely - Sakshi

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

వన్యప్రాణి మండలి సమావేశంలో ఆమోదం 

నిర్మల్‌/నిర్మల్‌టౌన్‌/సాక్షి, హైదరాబాద్‌: అభయారణ్యాల్లో రహదారులు వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా, అవి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్‌పాస్‌లు నిర్మించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. నిర్మల్‌లోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం నిర్వహించారు.

వర్చువల్‌ విధానంలో నిర్మల్‌ నుంచి మంత్రి పాల్గొనగా, అరణ్య భవన్‌ నుంచి అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. అభయారణ్యాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేలా రహదారుల వద్ద ముఖ్యమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణం, వాహనాల వేగ నియంత్రణ, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం, పులుల గణన.. తదితర అంశాలపై సమావేశాలో చర్చించారు.

మంత్రి మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసమే అండర్‌పాస్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి మండలి నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.  

నెహ్రూ జూపార్క్‌ అభివృద్ధికి చర్యలు.. 
రాష్ట్రంలో జీవవైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ‘నెహ్రూ జూలాజికల్‌ పార్కు’ను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అధ్యక్షతన జాపాట్‌ (జ్యూస్‌ అండ్‌ పార్కస్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ) కార్యవర్గ సమావేశాన్ని కూడా వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. నెహ్రూ జూలాజికల్‌ పార్కుతోపాటు రాష్ట్రంలోని 8 పార్కుల్లో వన్యప్రాణుల సంరక్షణ, పార్కుల అభివృద్ధి, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేక చర్యలపై చర్చించారు.

కాగా, నెహ్రూ జూలాజికల్‌ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ తెలిపారు. టికెట్‌ బుకింగ్, విరాళాలు, వన్యప్రాణుల దత్తత వంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ (సోషల్‌ ఫారెస్ట్రీ) ఆర్‌.ఎం. డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్‌ (వైల్డ్‌ లైఫ్‌) ఎ.కె. సిన్హా, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే కోనప్ప, రాఘవ, జూ పార్క్‌ డైరెక్టర్‌ ఎంజే అక్బర్, సీఎఫ్‌ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top