అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?

Telangana: No Supply Orange Price Hike - Sakshi

చుక్కలు చూపుతున్న బత్తాయి

రాష్ట్ర మార్కెట్‌లకు తగ్గిన సరఫరా

డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక అమాంతం పెరిగిన ధర

గత ఏడాది కిలో రూ.20, ఇప్పుడు రూ.70

రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న కోల్‌కతా, ఢిల్లీ, హరియాణా వ్యాపారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్‌-సీ అధికంగా ఉండే పండ్ల వినియోగానికి డిమాండ్‌ పెరగడంతో బత్తాయి పండ్లకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లకు బత్తాయి రాక తగ్గింది. ఒక్క కొత్తపేట పండ్ల మార్కెట్‌కే కనీసంగా రోజుకు 300 టన్నుల మేర బత్తాయి సరఫరా తగ్గింది. దీంతో రాష్ట్ర మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధర అమాంతం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.20 నుంచి రూ.30 పలకగా, ఇప్పుడది ఏకంగా రూ.70కి చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.

పొరుగు నుంచి ఎగబడ్డ వ్యాపారులు
రాష్ట్రంలో రోజుకు ఐదు వేలకుపైగా కోవిడ్‌ కేసులు నమోదవుతుండగా, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు సామాన్యులు సైతం ప్రతిరోజూ 500 మిల్లీగ్రామ్‌ల విటమిన్‌–సీ పండ్లను రోజువారీ ఆహారంగా తీసుకోవాలని, దీనిద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో సిట్రిక్‌ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి వైపు సామాన్యులు ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బత్తాయికి డిమాండ్‌ పెరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల పంటల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులే కోతలు చేసి, ప్యాకేజింగ్, రవాణా, లోడింగ్‌ ఇలా అన్నీ సొంత ఖర్చులతో కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు వీరికి అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ, హరియాణా, కోల్‌కతాతోపాటు రాజస్తాన్‌ నుంచి వ్యాపారులు టన్నుకు రూ.35 వేల నుంచి 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండటంతో హైదరాబాద్‌ మార్కెట్‌కు బత్తాయి రాక తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌కు దీని సరఫరా తగ్గింది. ప్రతి ఏటా కొత్తపేట మార్కెట్‌కు రోజుకు 500–600 టన్నుల మేర బత్తాయి రాగా, ఈ ఏడాది కేవలం 100–125 టన్నులు మాత్రమే వస్తోంది. ఇది మార్కెట్‌ అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. వచ్చిన కొద్దిపాటి బత్తాయిని వ్యాపారులు హోల్‌సేల్‌లో టన్నుకు రూ.40 వేల నుంచి 50వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో రూ.40–50 వరకు ఉంది. ఇది గత ఏడాది ధరలతో పోలిస్తే రూ.20 అధికం. ఇదే బత్తాయిని బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.70 వరకు కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

నిమ్మ, కివీ సైతం... 
ఇక సీ-విటమిన్‌ అధికంగా ఉండే నిమ్మకాయలకు చెప్పలేనంత డిమాండ్‌ ఉంది. గతంలో బహిరంగ మార్కెట్లలో రూ.10కి 3 నిమ్మకాయలు విక్రయించగా, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయే అమ్ముతున్నారు. సీ-విటమిన్‌కు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో కివీ పండ్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత ఏడాది 24 పండ్లు ఉండే ఒక్క బాక్స్‌ ధర రూ.వెయ్యి పలుకగా, ప్రస్తుతం రూ.3 వేలకు చేరింది. రోజుకు కొత్తపేట మార్కెట్‌కు వెయ్యి బాక్స్‌ల వరకు రాగా, ఇప్పుడది 500 నుంచి 600 బాక్స్‌లకు తగ్గింది. దీంతో అటు పండ్ల లభ్యత లేక.. ఇటు అధిక ధరలకు పండ్లు కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు.

చదవండి: కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం
చదవండి: ఉత్సవంతో వచ్చిన కరోనా.. అటవీ గ్రామాల్లో కల్లోలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top